calender_icon.png 15 July, 2025 | 9:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు లాభసాటి పంటలు సాగు చేసుకోవాలి

25-06-2025 12:42:37 AM

 కలెక్టర్ ఆదర్శ్ సురభి

కొత్తకోట జూన్ 24 : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వ్యవసాయ పెట్టుబడిగా వేసిన రైతు భరోసా డబ్బులను సద్వినియోగం చేసుకొని లాభసాటి పంటలు సాగు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జూన్ 16 న ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం నుండి రైతు నేస్తం కార్యక్రమం సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలోని రైతులందరికీ రూ. 9 వేల కోట్లు తొమ్మిది రోజుల్లోరైతుల ఖాతాల్లో జమ చేసిన సందర్భంగా మంగళవారం సచివాలయం రాజీవ్ విగ్రం వద్ద ఏర్పాటు చేసిన రైతు సంబరాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని 1600 రైతు వేదికల్లో వీడియో కాన్ఫర్స్ ద్వారా రైతులు హాజరై వీక్షించగా వనపర్తి జిల్లాలోని 43 రైతు రైతు కేంద్రాల్లో రైతులు పాల్గొని సంబరాలు చేసుకున్నారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, మదనపూర్ మార్కెట్ కమిటి చైర్మన్ ప్రశాంత్, రైతులు పెద్దమొత్తంలో కొత్తకోట మండలంలోని అమడబాకుల గ్రామ రైతు వేదికలో పాల్గొన్నారు.

రాష్ట్ర ముఖ్య మంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వనపర్తి జిల్లాలోనీ 196683 రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేయడం జరిగిందని, సాంకేతిక కారణాల వల్ల లేదా మరే ఇతర కారణాల వల్ల డబ్బులు రాని వారు వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు.

ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద ఇచ్చిన డబ్బులను సద్వినియోగం చేసుకొని నాణ్యమైన విత్తనాలు, ఎరువులు కొనుక్కొని లాభసాటి వ్యవసాయం చేసుకోవాలని సూచించారు. రైతులు వరి పంట మాత్రమే కాకుండా పామాయిల్ సాగు, చిరు ధాన్యాలు, కూరగాయల సాగు వంటి పంటలను సాగు చేసి లాభాలు ఆర్జించాలని తెలిపారు.

వడ్లు వేస్తే మాత్రం సన్న రకం వడ్లు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్, ఉద్యాన శాఖ అధికారి విజయ భాస్కర్ కొత్తకోట తహసిల్దార్ వెంకటేశ్వర్లు మదనాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రశాంత్, ఎ .ఓ జాస్మిన్ , టెక్నికల్ ఏవో మాధురి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కృష్ణారెడ్డి, రైతులు పాల్గొన్నారు.