calender_icon.png 15 July, 2025 | 6:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జల వివాదాలపై రేపు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ

15-07-2025 01:23:55 AM

  1. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు సమాచారం ఇచ్చిన కేంద్రం
  2.  
  3. కేంద్రం పిలుపుతో నీటివాటాల సాధనకు ఒత్తిడి తేవాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం

ప్రతీ నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలి..

కృష్ణాపై ఉన్న ప్రాజెక్టులకు వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలి..

శాశ్వత పరిష్కారాలపై కేంద్రం దృష్టి సారించాలని కేంద్రాన్ని కోరనున్న ముఖ్యమంత్రి

సీఎం ఆదేశంతో కేంద్ర జల వనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌కు మంత్రి ఉత్తమ్ లేఖ

హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి): తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య జల వివాదాలపై చర్చిద్దామని కేంద్ర ప్రభుత్వం సోమ వారం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు సమాచారం ఇచ్చింది. ఈ నెల 16న ఢిల్లీకి రావా లని, కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం కావాల ని కోరింది.

ఈ నేపథ్యంలో కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన ప్రతీ నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలని, న్యాయపరంగా రావాల్సిన నీటి వాటాల సాధనకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. కృష్ణాపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలని, నీటి కేటాయింపులతో పాటు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు.

కృష్ణాతో పాటు గోదావరి జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించుకోవటంతో పాటు, ఇంత కాలం జరిగిన అన్యాయానికి శాశ్వతమైన పరిష్కారాలను సాధించాలని రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సీఎం సూచనలతో నీటిపారుదల శాఖ మంత్రి  ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌కు లేఖ రాశారు.

ఈనెల 16న ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రితో సమావేశమై తెలంగాణ నీటి వాటాల సాధనతో పాటు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల అనుమతులు, నీటి కేటాయింపులు, కొత్త ప్రాజెక్టులకు పట్టుబట్టాలని నిర్ణయించారు. 

పాలమూరు, డిండి డీపీఆర్‌లను ఆమోదించాలి..

తెలంగాణకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, అనుమతులు, కృష్ణా, గోదావరి నదీ బేసిన్‌లలో సమస్యలపై కేంద్రం వెంటనే చొరవచూపాలని లేఖలో పేర్కొన్నారు. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు ఇప్పటికీ క్లియరెన్స్ రాలేదని, ఈ ప్రాజెక్టుల డీపీఆర్లను కేంద్ర జల సంఘం ఆమోదించాలని, ఆ తర్వాత పర్యావరణ శాఖ, సీసీకు ఈసీ జారీ చేయమని సిఫార్సు చేయాలని లేఖలో సూచించారు. 

ఇచ్చంపల్లి వద్ద కొత్త ప్రాజెక్టుకు అనుమతించాలి..

2010లోనే కేంద్ర జలసంఘం ఇచ్చంపల్లి ప్రాజెక్టుకు అనుమతించిందని, 2016 లో తెలంగాణ, మహారాష్ర్ట మధ్య ఒప్పందం కుదిరిందని లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడున్న 20 టీఎంసీల కేటాయింపులను 80 టీఎంసీలకు పెంచాలని కోరారు. ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, ఏఐబీపీ కింద ఆర్థిక సాయం అందించాలన్నారు.

గోదావరి బేసి న్ నుంచి ఇతర బేసిన్‌లకు నీటిని బదిలీ చేసే విషయంపై చర్చలు జరగాల్సిన అవసరముందని, తెలంగాణలోని కరువు పీడిత ప్రాంతాలకు సాగు, తాగునీరు అవసరాలు తీర్చేందుకు 200 టీఎంసీల వరద నీటిని  ఉ పయోగించుకునేలా ఇచ్చంపల్లి వద్ద కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించాలని కోరారు. 

కృష్ణా జలాల మళ్లింపును నియంత్రించాలి...

కేడబ్ల్యూడీటీ అవార్డు ప్రకారం చేపట్టిన ప్రాజెక్టులకు కేంద్ర జల సంఘం అనుమతులివ్వాలని, నిబంధనలకు విరుద్ధంగా ఇతర బేసిన్లకు నీటిని మళ్లించడాన్ని కేఆర్‌ఎంబీ అడ్డుకోవాలని లేఖలో కోరారు. కృష్ణా జలాల మళ్లింపుపై నియంత్రణలు విధించాలని, ఇన్-బేసిన్ అవసరాల విషయంలో కేఆర్‌ఎంబీ న్యాయంగా, నిష్పక్షపా తంగా వ్యవహరించాలన్నారు. నీటి ప్రవాహాలను కచ్చితంగా లెక్కించేందుకు టెలిమెట్రీ అమలు చేయాలని సూచించారు.

ఏపీ ప్రభుత్వం తుంగభద్ర నీటిని కేసీ కెనాల్ నుంచి హెచ్‌ఎల్సీ, ఎల్‌ఎల్సీ కెనాల్‌కు నీటిని డైవర్ట్ చేస్తోందని, ఇది కేడబ్ల్యూడీటీ అవార్డును ఉల్లంఘించటమే అవుతుందన్నారు. అవార్డు ప్రకారం తుంగభద్ర నుంచి వచ్చే ప్రవాహాలు కృష్ణా నదికి రావాలని, దానికి విరుద్ధంగా ఏపీ అనుసరిస్తున్న తీరుపై ఇప్పటికే తుంగభద్ర బోర్డుకు లేఖలు రాశా మన్నారు.

ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్‌తోనే రైతులకు ప్రయోజనం..

ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం కారణంగా కరువు పీడిత  ప్రాంతాల రైతులకు ఆశించిన ప్రయోజనాలు అందడం లేదని, ఈ ప్రాజెక్టులకు ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్ వస్తే కేంద్రం నుంచి గ్రాంట్లు, ఆర్థిక సాయంతో పాటు నాబార్డ్ లాంటి ఆర్థిక సంస్థల నుంచి తక్కువ వడ్డీతో రుణాలు పొందే వీలుంటుందని లేఖలో పేర్కొన్నారు. 2021 సెప్టెంబర్ 21న కేంద్ర జలసంఘానికి సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ (తుపాకులగూడెం బ్యారేజ్) డీపీఆర్ సమర్పించినట్లు, ఛత్తీస్‌గఢ్ నుంచి నో- అబ్జెక్షన్  లేనందున ఇంటర్- స్టేట్ మ్యాటర్స్ డైరెక్టరేట్ నుంచి క్లియరెన్స్ ఆలస్యమవుతోందన్నారు.

ఛత్తీస్‌గఢ్ సూచన లను, నిబంధనల ప్రకారం అక్కడి భూ యజమానులకు నష్టపరిహారం చెల్లించేందు కు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నా రు. కృష్ణా బేసిన్‌లో శ్రీశైలం నుంచి ఇతర బేసిన్లకు ఏపీ అక్రమంగా నీటిని మళ్లిస్తోంద ని, శ్రీశైలం అట్టడుగు నుంచి నీటిని డైవర్ట్ చే సే నిర్మాణాలతో రిజర్వాయర్ ఖాళీ అవుతోందని లేఖలో పేర్కొన్నారు. దీంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ మీద ఆధారపడ్డ జల విద్యుత్తు ఉత్పత్తిపై ప్రభావం పడుతోందన్నారు. 

ప్రమాదకరంగా శ్రీశైలం డ్యామ్ నిర్వహణ..

శ్రీశైలం కుడి ప్రధాన కాలువ డిశ్చార్జ్ కెపాసిటీని అనధికారికంగా పెంచుకుందని, 1.50 లక్షల క్యూసెక్కుల నీటిని తరలించుకునేలా ఏర్పాట్లు చేసుకుందని లేఖలో పేర్కొన్నారు. శ్రీశైలం డ్యామ్ నిర్వహణ ప్రమాదకరంగా మారిందని,  తెలంగాణ ప్రభుత్వం ప దే పదే ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ  ప్లంజ్ పూల్‌కు మరమ్మతులు చేపట్టలేదన్నారు.