15-07-2025 01:25:37 AM
-అక్రమ వసూళ్లకు అడ్డాగా బార్డర్ చెక్‌పోస్టులు
-ఏసీబీ ఎప్పుడు వెళ్లినా అడ్డంగా దొరికే డిపార్ట్‌మెంట్ ఆర్టీఏ
-అవినీతికి అలవాటు పడ్డ అధికారులు
-అక్కడ పోస్టింగుల కోసం భారీ పైరవీలు, పెద్దఎత్తున లంచాలు
- కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్న వైనం
ఏసీబీ అధికారులు ఎక్కడైనా దాడులు చేయాలంటే పక్కా ప్రణాళికతో వెళ్తారు.. ఎవరైనా అధికారి లంచం అడుగుతున్నాడని బాధితులు ఫిర్యాదులు చేసే సందర్భంలో వారు లంచంగా ఇచ్చే సొమ్ముకు కెమికల్ పౌడర్ (ఫినాలాప్తాలీన్ పౌడర్)ను పూస్తారు. ఆ నోట్ల సీరియల్ నెంబర్లను వీడియో రికార్డు చేసుకుని ఆధారంగా ఉంచుకుంటారు. లంచం తీసుకుంటున్న అధికారిని మాటువేసి పట్టుకుంటారు. ఆ డబ్బును ముట్టుకున్న అధికారి చేతులపై సాఫ్ట్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ చల్లగానే గులాబీ రంగు వస్తుంది. దీంతో లంచం తీసుకున్నట్లుగా గుర్తించి సదరు అక్రమాధికారిని అరెస్టు చేస్తారు. ఈ తతంగంలో చాలాసార్లు
డబ్బులు చేతిలోకి తీసుకోకుండా తప్పించుకునే అధికారులూ ఉంటారు. వారిని పట్టుకునే క్రమంలో ఏసీబీ సక్సెస్ అవ్వవచ్చు లేదా కాకపోవచ్చు. కానీ రాష్ట్రంలో రవాణా శాఖ నిర్వహిస్తున్న సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద ఏసీబీ తనిఖీలకు వెళ్తే ఈ తతంగం ఏదీ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ సాధారణ పౌరుడిలా నిలబడి చూస్తే చాలు.. వాహనదారులు రావడం.. లంచం ఇవ్వడం.. వెళ్లిపోవడం కనిపిస్తుంది. లారీల డ్రైవర్ల నుంచి నిత్యం ఒక్కో చెక్‌పోస్టు వద్ద ఏకంగా రూ.10వేల నుంచి రూ.15లక్షల వరకు లంచాలు వసూలు చేస్తున్నారు. ఈ చెక్‌పోస్టుల వద్ద ఏసీబీ ఎన్నిసార్లు దాడులు చేసినా అక్రమార్జన మామూలే..
హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి): అంతర్రాష్ర్ట చెక్‌పోస్టులు అక్రమాలకు అ డ్డాగా మారాయి. దాదాపు రాష్ట్రంలోని అన్ని చెక్‌పోస్టుల వద్ద కూడా భారీ అవినీతి జరుగుతోంది. అన్ని పేపర్లు, అనుమతులు సక్ర మంగానే ఉన్నాయంటూ నగదు ఇవ్వకుం డా వెళ్తున్న లారీలను వెంబడించి కేసులు పెట్టి ఏదో కారణం చూపి రూ.10వేల నుంచి రూ.20వేల వరకు ఫైన్లు వేసేస్తున్నారు. దీంతో జడుసుకుంటున్న వాహనాల డ్రైవర్లు లంచాలు ఇచ్చి వెళ్లిపోతున్నారు.
చెక్‌పోస్టులో పనిచేసేందుకు ఫుల్ డిమాండ్ ఉం టుంది. అందుకే హైదరాబాద్‌లో ఈ వ్యవహారాలను చూసే ఓ ముఖ్యమైన అధికారికి ముందే లంచం ఇచ్చి మరీ ఇక్కడ పోస్టింగ్ పట్టేస్తున్నారు. సదరు అధికారి తనపైన ఎవరికెంత ఇవ్వాలో చెప్తూ ఈ పోస్టులకు మరింత డిమాండ్‌ను తీసుకువస్తున్నారు. అన్ని చెక్‌పోస్టుల నుంచి నెలనెలా ఓ మొత్తం వసూలు చేసి ఓ ముఖ్యప్రజాప్రతినిధి వరకు చెల్లిస్తున్నామని..ఫలానా నేతకు నెలకు రూ.10కోట్లు ఇవ్వాలి తెలుసా అంటూ ఆ ముఖ్యమైన అధికారి.. చెక్‌పోస్టుల నుంచి భారీగా వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
ఇంతచేసినా కొన్ని చెక్‌పోస్టుల వద్ద పనిచేసే ఎంవీఐలకు నెలకు ఒక్క రోజు డ్యూ టీ దొరికినా చాలనే తీరుగా పరిస్థితి ఉంటుం ది. అంటే ఒక్క రోజులో ఎంత సంపాదిస్తారో అర్థం చేసుకోవచ్చు. కామారెడ్డి జిల్లాలోని ఓ బార్డర్ చెక్‌పోస్టులో కొద్దికాలం క్రితం వరకు ఏకంగా 21మంది ఎంవీఐలు డిప్యుటేషన్‌పై కొనసాగారు. అలాగే జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ చెక్‌పోస్ట్ వద్ద కూడా ఇదే పరిస్థితి ఉండేది.
కొత్త ప్రభుత్వం వచ్చాక పైరవీలతో చాలాకాలం పాటు తిష్ఠ వేసిన సద రు అధికారులను రాష్ర్ట ప్రభుత్వం వెనక్కి పంపింది. అయితే పాతవాళ్లు పోయి ఇప్పు డు కొత్తవాళ్లు వచ్చారు. ప్రతి అధికారి కూడా చెక్‌పోస్ట్ వద్ద ప్రత్యేకంగా తన కోసం ఓ ప్రైవేటు వ్యక్తిని నియమించుకుంటాడు. ఇక తన డ్రైవర్ కూడా చెక్‌పోస్ట్ వద్ద వసూళ్ల కో సం పనిచేస్తాడు. అంతా కలిసి రోజుకు రూ. 10- వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఒక్కో అధికారి ఏడాదికి రూ.30 లక్షల నుంచి రూ.కోటి వరకు చెక్‌పోస్టుల వద్ద అవినీతి సొమ్మును వెనకేసుకుంటారని అదే శాఖకు చెందిన ఓ ఉద్యోగి ‘విజయక్రాంతి’కి తెలిపారు.
ప్రత్యేకంగా వసూళ్ల కోసం డబ్బా..
తెలంగాణ- సరిహద్దుల్లోని కామారెడ్డి జిల్లా మద్నూర్ ఆర్టీఏ చెక్‌పోస్ట్ వద్ద గతంలో ఏసీబీ దాడులు చేసింది. భారీ వాహనాల ఓవర్ లోడింగ్‌పై నిఘా ఉంచాల్సిన చెక్‌పోస్ట్ అధికారులు అదేమీ పట్టించు కోకుండా వారి నుంచి వసూళ్లు చేయడం ఏసీబీ గుర్తించింది. తమ తరపున వసూళ్లు చేసేందుకు దళారులను నియమించుకున్నారని తనిఖీల్లో గమనించింది. వసూళ్ల కోసం ప్రత్యేకంగా చెక్‌పోస్ట్ పక్కనే ఉన్న షెడ్‌లో ఒక డబ్బాను ఏర్పాటు చేస్తే అక్కడి నుంచి వెళ్లే ప్రతి లారీడ్రైవర్ అందులో రూ.1000 వర కు వేసి వెళ్తున్నారని గుర్తించింది.
అక్రమంగా వసూళ్ల కోసం పనిచేసే కూలీలకు (దళారులు) రూ.8వేల వరకు రోజు కూలీ ఇస్తు న్నారని ఏసీబీ తనిఖీల్లో తేలడంతో విస్తుపోయారు. దీంతో పాటు సదరు కూలీ సొంత వసూళ్లకు పాల్పడుతూ రోజుకు రూ.20వేలకు పైగా సంపాదించుకుపోయే పరిస్థితిని ఏసీబీ అధికారులకే దిమ్మదిరిగిపోయింది. గత నెల 25న ఏసీబీ ప్రత్యక్షంగా గమనించిన వేళ రూ.2.5 లక్షల వరకు అక్రమంగా వసూళ్లు చేసినట్లు తేలింది. ఈ తతంగాన్నంతా ఏసీబీ వీడియో చిత్రీకరణ చేసింది. ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న లారీల నుంచి ఖజానాకు రావాల్సిన కోట్లాది రూపాయలకు గం డిపడుతున్నట్లుగా ఏసీబీ అధికారులు గు ర్తించి రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర సమాచా రం అందించారు. రాష్ర్టంలోని సాలూరా, ఆదిలాబాద్, జహీరాబాద్, మద్నూర్, బైం సా, వాంకిడి, అలంపూర్, కృష్ణ, నాగార్జునసాగర్, విష్ణుపురం, కోదాడ, కల్లూరు, అశ్వా రావుపేట, పాల్వంచల్లో ఉన్న చెక్‌పోస్టులన్నింటి వద్దా ఇదే పరిస్థితి.
అన్ని చోట్లా ప్రైవేటు వ్యక్తులే..
అధికారులు పేరుకే విధుల్లో ఉంటారు. అక్కడంతా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే వ్యవహారం నడుస్తుంటుంది. ప్రైవేట్ వ్యక్తులకు ఒక్కో వ్యక్తికి రోజుకు రూ.వెయ్యి నుంచి వారి స్థాయిని బట్టి ఇంకా ఎక్కువ చెల్లిస్తారు. చెక్‌పోస్టుల వద్ద ప్రైవేటు వ్యక్తులు ఉండవద్దనే నిబంధనలను పట్టించుకోకుండా అక్కడ పనిచేసే అధికారులు వసూళ్ల పర్వానికి తెగబడుతున్నారు. ఈ చెక్‌పోస్టులపై జిల్లా అధి కారి, డీటీసీ పర్యవేక్షణ, నియంత్రణ ఉండా లి. కానీ అలాంటిదేమీ కనిపించదు.
వారు వచ్చినా అంతా ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్లుగా వ్యవహారం నడుస్తుంటుంది. చెక్‌పోస్టుల్లో కనీసం విధుల్లో ఉన్న సిబ్బంది హోదా, పేర్లు బోర్డుపై రాయాల్సి ఉన్నా పాటించరు. విధులు నిర్వహించే సిబ్బంది కచ్చితంగా యూనిఫామ్స్ ధరించాలనే నిబంధన కూడా చాలాచోట్ల అమలుకావడం లేదు. చెక్‌పోస్టు మీదుగా వెళ్తున్న వా హనాల వివరాలను అరకొరగా నమోదు చేస్తున్నారు. సరైన అనుమతి పత్రాలు, ఫిట్‌నెస్ ధ్రువీకరణపత్రాలు లేకుండా సరిహద్దు దాటుతున్న వాహనాలను చూసీచూడనట్లు వదిలేస్తున్నారు.
చెక్‌పోస్టులకు ఎక్కడా లేని డిమాండ్..
రవాణ శాఖ చెక్‌పోస్టుల్లో ప్రభుత్వం నేరుగా వచ్చే ఆదాయం పెద్దగా ఏమీ ఉండదు. ఇప్పుడంతా ఆన్‌లైన్ కావడంతో పర్మిట్లన్నీ ఆన్‌లైన్‌లోనే తీసుకుంటున్నారు. కానీ చెక్‌పోస్టుల వద్ద వాహనానికో రేటు కట్టి అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారు. చెక్‌పోస్టు దాటి వెళ్లే వాహనాలన్నీ వీరితో ఎందుకు తలనొప్పి అనుకుని అన్నీ సక్రమంగా ఉన్నా లంచం చెల్లించి ముందుకెళ్తు ఉంటారు. ఒక్కో చెక్‌పోస్టులో అవసరం లేకపోయినా 10 నుంచి 15 మంది అధికారులు విధులు నిర్వర్తించే పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్ర రాజధానిలో ఆర్టీఏ సిబ్బంది సరిపోయినంత మంది లేక రవాణ శాఖ ఆదాయం కోల్పోతోంది. తనిఖీలు చేసేందుకు సైతం సిబ్బంది లేక ఇబ్బంది పడుతోంది. కానీ చెక్‌పోస్టుల వద్ద మాత్రం అవసరానికి మించి అధికారులు పనిచేస్తున్నారు.
సర్కారుకు దమ్మిడి ఆదాయం లేదనే ఏసీబీ దాడులు..
రవాణా శాఖ పనితీరుపై సర్కారు ఏర్పడిన మొదట్లోనే వివరాలు తీసుకున్న ప్రభుత్వ పెద్దలకు చెక్‌పోస్టుల వల్ల సర్కారుకు దమ్మిడి ఆదాయం లేదని, అవి తెల్ల ఏనుగులతో సమానమని ఉన్నతాధికారు లు వివరించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు చెక్‌పోస్టులను తొలగించడమే మేలని తెలిపారు. అందుకు తగ్గట్లుగా ఓ నివేదికను అందించారు. ప్రభుత్వం సైతం తొలగింపునకు అందుకు సిద్ధపడిందని భావించారు. మొదట ఎన్నికల కోడ్ వల్ల ప్రక్రియ ఆగిపోయిందన్నారు. చెక్‌పోస్టులను శాశ్వతంగా ఎత్తేసేందుకు సర్కారు సిద్ధమైందని ప్రచారం జరిగింది. కానీ అక్ర మ వసూళ్లకు అలవాటు పడిన కొందరు వ్యవస్థనే భ్రష్టుపట్టించారని తెలుస్తోంది. అందుకే ఆ ప్రక్రియ ఫైల్ ఆగిపోయిందని అంటున్నారు.