15-07-2025 12:47:08 AM
హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి): పదోన్నతి ఇస్తామంటే ఎవరైనా సంతోషిస్తా రు. కానీ హైదరాబాద్‌కు చెందిన కొందరు ప్రభుత్వ వైద్యులు మాత్రం అందుకు ససేమిరా అంటున్నారు. పదోన్నతి లేకున్నా ఫర్వాలేదుగానీ రాజధానిని వదలబోమంటున్నారు. ప దోన్నతి ఇవ్వాలనుకుంటే నగరంలోని దవాఖానాల్లో (ఉస్మానియా, గాంధీ మొ.) మాత్ర మే పోస్టింగులు ఇవ్వాలంటున్నారు.
వైద్యారోగ్య శాఖ అధికారులు మాత్రం పదోన్నతు లు, ఇచ్చిన పోస్టింగ్‌ను తప్పక తీసుకోవాల్సిందేనని స్పష్టం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు అదనుగా గతేడాది జరిగిన సాధారణ బదిలీల్లో నగరం విడిచివెళ్లిన కొందరు వైద్యులు తిరిగి భాగ్యనగరానికి చేరుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. పదవీ విరమణ వ యసు దగ్గర పడుతున్న కొందరు సీనియర్లు మాత్రం పదోన్నతులు అవసరం లేదని.. రిటైరయ్యే వరకు ఇదే పోస్టులో కొనసాగుతామని చెబుతున్నారు.
పదోన్నతి తీసుకొని ఇచ్చిన పోస్టింగ్ (జిల్లాలు)లో చేరాలంటే మాత్రం సెలవులో వెళ్లిపోతామని చెబుతున్నట్టు తెలుస్తోంది. ఏతావాతా తేలిందేంటం టే చాలాకాలం తర్వాత వైద్యారో గ్య శాఖలో పదోన్నతులకు సిద్ధమైన వేళ వైద్యుల్లోని కొందరు వ ర్గాలుగా వీడి తమతమ ప్రయత్నాలు షురూ చేశారు. డీఎంఈతో పాటు సంబంధిత మం త్రిని కలిసి తమ సమస్యలు విన్నవించుకుంటున్నారు.
దిద్దుబాటు చర్యల్లో భాగంగానే పదోన్నతులు
రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో త గినంత మంది ఫ్యాకల్టీ అందుబాటులో లేరం టూ నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) నోటీసులు ఇచ్చిన క్రమంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అందులో భాగం గానే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌కు అవకాశం ఉన్న పోస్టులైన 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి ప్రకటన ఇచ్చింది. మరో 714 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం కూడా తెలిపింది. ఇక ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లకు పదోన్నతులివ్వాలని నిర్ణయించింది.
ప్రొఫెసర్లుగా ఉన్న 44 మంది సీనియర్లకు అడిషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లుగా పదోన్నతి కల్పిం చింది. వారిని మెడికల్ కాలేజీల ప్రిన్సిపళ్లుగా, టీచింగ్ హాస్పిటల్స్ సూపరింటెండెంట్లుగా నియమించింది. అసోసియేట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న 278 మందికి ప్రొఫెసర్లుగా, అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న 231 మందికి అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతులిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
కొంత మంది కుట్ర చేస్తున్నారు...
అసోసియేట్ ప్రొఫెసర్లను ప్రొఫెసర్లుగా ప్ర మోట్ చేయకుండా అడ్డుకునే కుట్రల్లో కొంతమంది డాక్టర్లు ఉన్నట్టు, వారు రెండు వర్గాలు గా ఏర్పడినట్టు వైద్య వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతేడాది జరిగిన సాధారణ బదిలీల్లో గాంధీ, ఉస్మానియా నుంచి జిల్లాల్లోని కాలేజీల్లోకి బదిలీ అయినవారు ఒక వర్గంగా చెబు తున్నారు. ఈ వర్గం వారు జిల్లాల్లో కనీసం ఏడాది కూడా పనిచేయకుండానే మళ్లీ గాంధీ, ఉస్మానియాకు యత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
దీనికోసమే ప్రమోషన్లు ఇవ్వొద్దని కోరుకుంటున్నారని.. వారు నగరానికి రావద్దని కోరు కుంటున్న వారు చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో పనిచేస్తూ.. ప్రమోషన్ల తర్వా త జిల్లాల్లో ఉన్న కాలేజీల్లోకి వెళ్లాల్సి వస్తుందన్న భయంతో ప్రమోషన్లను అడ్డుకునేందు కు ప్రయత్నిస్తున్నది రెండో వర్గమంటూ మరో ప్రచారం నడుస్తోంది.
ఈ క్రమంలో అసోసియేట్ ప్రొఫెసర్లను ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పిస్తూ బదిలీపై జిల్లాలకు పంపించాలనే ఉన్నతాధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోం ది. అందరికీ హైదరాబాద్‌లోనే పోస్టింగ్ ఇస్తే, జిల్లాల్లోని కాలేజీల్లో ఎవరు పనిచేస్తారని కీలకమైన ఓ అధికారి విజయక్రాంతితో అన్నారు. అందుకే తొలుత జిల్లాల్లోని కాలేజీల్లో పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింద ని ఆయన తెలిపారు.
ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి..
గత ఐదారేళ్లుగా జిల్లాల్లో ఉన్న వారికి బదిలీలు చేపట్టిన తర్వాతే పదోన్నతులు ఇవ్వాలని కొందరు వైద్యులు కోరుతున్నారు. మరోవైపు నగరంలో రిటైర్‌మెంట్‌కు దగ్గర్లో ఉన్న వైద్యు ల అభిప్రాయం మరోలా ఉంది. రెండేళ్లలో పదవీ విరమణ పొందుతానని..
ఇప్పుడు నేను జిల్లాలో పనిచేసి నిరూపించుకోవాల్సిందేమీ లేదని, అందుకే పదోన్నతిని ఇష్టపడటం లేదని ఓ సీనియర్ వైద్యుడు విజయక్రాంతికి తెలిపారు. ఇలాంటి వారి విషయంలో ప్రభుత్వం కాస్త ఆలోచించి వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ముందుకు వెళ్తే బాగుంటుందని.. లేదంటే ఎంతో సీనియర్ల వైద్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని కొందరి వైద్యుల వాదన.