15-07-2025 01:22:12 AM
1938--2025
అలనాటి మేటి నటి సరోజాదేవి కన్నుమూత
* ముద్దుముద్దు మాటల ముగ్ధమనోహర రూపం ఆమెది.. మూడు దశా బ్దాల పాటు 160 చిత్రాల్లో ప్రధాన పాత్రల్లో కనిపించిన ఘనత ఆమెది.. సీనియర్ నటి బీ సరోజాదేవి (87) సోమవారం బెంగళూరులో కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యతో ఆమె బాధపడుతున్నారు. 1938, జనవరి 7న బెంగళూరులో జన్మించిన సరోజాదేవి తెలుగు, కన్నడ, తమిళ, హిందీ సినిమాల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, శివాజీ గణేశన్, జెమిని గణేశన్, దిలీప్‌కుమార్, సునీల్ దత్, రాజేంద్రకుమార్ వంటి దిగ్గజ నటుల సరసన పలు సూపర్‌హిట్ సినిమాల్లో నటించారు. అభిమానుల గుండెల్లో ‘అభినయ సరస్వతి’గా చెరగని ముద్ర వేశారు.
* ‘అభినయ సరస్వతి’గా తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నా.. తమిళులు ముద్దుగా ‘కన్నడ చిలుక’ అని పిలుచుకున్నా.. ‘మద్రాస్ కా సుందర్ తార’ అని ఉత్తరాది పత్రికలు పొగిడినా అది కేవలం అలనాటి అందాల తార బీ సరోజాదేవికే చెల్లింది. చిటపట చినుకులుపడుతూ ఉంటే.. చెలికాడే సరసన ఉంటే.. అంటూ హుషారైన పాటలతో కుర్రకారును ఉర్రూతలూగించిన సరోజాదేవి పేరు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.
చిన్నప్పుడు చదువుకున్న చోట సన్యాసులను చూసి.. పెద్దయ్యాక తాను కూడా వారిలా సన్యాసినిగా జీవించాలనుకున్న సరోజాదేవి తండ్రి పోద్బలంతో చిత్రసీమలో అడుగుపెట్టారు. తండ్రి బైరప్ప మైసూరులో పోలీసు ఉద్యోగిగా పనిచేసేవారు. కళలపై ఉన్న ఇష్టంతో ఆయన నాటక సంస్థలో చేరి నటించేవాడు. అప్పుడప్పుడు సరోజాదేవిని కూడా నాటకాల్లో నటింపజేస్తూ ఆ పాత్రల్లో తన కూతుర్ని చూసుకొని మురిసిపోయేవాడు.
అలా సరోజాదేవి నటించిన ఓ నాటక ప్రదర్శనను చూసిన కన్నడ ద ర్శక నిర్మాత కన్నప్ప.. ఆమెకు 1955లో ‘మహాకవి కాళిదాస’ అనే కన్నడ చిత్రంలో అవకాశం ఇచ్చారు. అప్పుడు సరోజాదేవి వయసు 13 ఏళ్లు. తర్వాత అవకాశాలు వరుస కడుతుండటంతో వారి కుటుంబం మద్రాసుకు మకాం మార్చింది. అలా టీనేజ్‌లో నటిగా తెరంగేట్రం చేసిన ఆమె.. ఆ భాషలో ఆఖరి సారి ‘నటసార్వభౌమ (2019) చిత్రంలో అతిథి పాత్రలో కనిపించారు.
తెలుగు ‘పెళ్లి సందడి’లో తొలి అవకాశం.. కానీ..
తెలుగులో సరోజాదేవి అవకాశం అందుకున్న తొలిచిత్రం ‘పెళ్లిసందడి’ అయినప్పటికీ ఆమె నటించిన మరో సినిమా ‘పాండురంగ మహత్మ్యం’ ముందుగా విడుదలైంది. తెలుగులో ఆఖరిగా ‘దేవి అభయం’లో నటించారామె. తెలుగులో మహాకవి కాళిదాసు, భూకైలాస్, పెళ్లికానుక, పెళ్లిసందడి, ఇంటికి దీపం ఇల్లాలే, జగదేకవీరుని కథ, శ్రీసీతారామ కల్యాణం, దాగుడు మూతలు, ఆత్మబలం, అమరశిల్పి జక్కన, శకుంతల, ఉమాచండీ గౌరీశంకరుల కథ, శ్రీరామాంజనేయ యుద్ధం, సీతారామ వనవాసం, దానవీర శూరకర్ణ వంటి గొప్ప చిత్రాల్లో నటించి ‘అభినయ సరస్వతి’ బిరుదాంకితులయ్యారు. 1955 నుంచి 1984 మధ్యకాలంలో 29 ఏళ్లపాటు వరుసగా 160కిపైగా చిత్రాల్లో లీడ్‌రోల్స్‌లో నటించిన ఏకైక నటి సరోజాదేవి కావడం విశేషం. తెలుగులో తొలిసారి పాండురంగ మహాత్మ్యం (1957)లో ఎన్టీఆర్ సరసన నటించిన సరోజాదేవికి ప్రముఖ తెలుగు నటి కృష్ణకుమారి డబ్బింగ్ చెప్పారు. తర్వాతి కాలంలో డబ్బిం గ్ అవసరం లేకుండా తన వాయిస్‌లోనే డైలాగ్స్ చెప్పారు.
అందరికీ హీరోయిన్..
ఎన్టీఆరే అభిమాన హీరో
ఎన్నో భాషల్లో ఎంతోమంది అగ్ర హీరోల సరసన నటించిన సరోజాదేవి తన అభిమాన నటుడు మాత్రం ఎన్టీఆరేనని పలు సందర్భాల్లో చెప్పారు. ఆయన ముందు డైలాగ్ చెప్పేందుకు భయపడేదాన్ని అని సరోజాదేవి.. తెలుగు స్పష్టంగా మాట్లాడటం నేర్పింది కూడా ఆయనేనని చెప్పడం ఆమె గొప్ప మనసుకు నిదర్శనం. వారిద్దరి చిత్రబంధం కూడా అదే తీరులో ముడిపడటం విశేషం. ఎన్టీఆర్ నటించిన జానపద, పౌరాణిక, సాంఘిక, చారిత్రక చిత్రాల్లో సరోజాదేవికి తగిన పాత్రలే దక్కాయి. తన దర్శకత్వంలో రూపొందిన చివరిచిత్రం ‘సామ్రాట్ అశోక’లోనూ సరోజాదేవికి తగిన పాత్ర ఇచ్చి గౌరవించారు ఎన్టీఆర్.
వైజయంతీమాలతో పోలిక!
తమిళంలో ఆమె నటించిన ‘ఇరంబుతిరై’ని హిందీలో ‘పైగా’ పేరుతో పునర్నిర్మించారు. ఆ సమయంలోనే బాలీవుడ్ స్టార్ దిలీప్‌కుమార్‌తో ఆమెకు పరిచయం ఏర్పడటంతో అక్కడా అనేక సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. దిలీప్‌కుమార్, వైజయంతీమాల నటించిన ‘పైఘమ్’తో తొలిసారి హిందీ తెరపై వెలిగిన సరోజాదేవిని చూసి ఆమె వైజయంతీమాల సోదరిగా భావించారు అక్కడి ప్రేక్షకులు. వీళ్లిద్దరికీ దగ్గరి పోలికలు ఉండటమే అందుకు కారణం.
మచ్చ లేని కెరీర్
తల్లిదండ్రుల బలవంతంతో సినిమాల్లోకి వచ్చిన సరోజాదేవి ఉత్తర, దక్షిణాది చిత్రసీమల్లోని నేమ్, ఫేమ్ ఉన్న అగ్ర హీరోలం దరితోనూ స్క్రీన్ పంచుకున్నారు. తన సుదీర్ఘ సినీ జీవన ప్రయాణంలో ఒక్క గాసిప్ కూడా లేకపోవటం తన అదృష్టమని గతంలో తెలిపారు. అమ్మానాన్నల ప్రోత్సాహంతో ఇండస్ట్రీకి వచ్చి ఆమెకు భర్త శ్రీహర్ష నుంచి పూర్తిస్థాయి ప్రోత్సాహం లభించడం, ఎవరూ తనపై కట్టుకథలు అల్లకుండా కెరీర్ గడిచిపోవడం సరోజాదేవి ఇంటర్వ్యూల్లో చెప్పినట్టు నిజంగా ఆమె చేసుకున్న పుణ్యఫలమే.
ఒక్కో చిత్రసీమలో ఒక్కో పేరుతో..
సరోజాదేవి అందచందాలను వర్ణించడానికి తెలుగులోనే కాదు ఏ భాష లోనూ సరైన పదాలు లేవంటే అతిశయోక్తి కాదనే రూపం ఆమె సొతం. చిరునవ్వులు చిందిస్తూ, చిలుక పలుకులు వల్లిస్తూ చూ పరులను ఇట్టే ఆకట్టుకునే సౌందర్యంతో తెలుగు నాట తనదైన బాణీ పలికించారామె. పుట్టింది కన్నడ సీమలో అయినా స్పష్టమైన ఉచ్ఛారణతో తెలుగు పదాలను పట్టిపట్టి పలికిన సరోజాదేవికి అదే తన బాణీగా భాసిల్లింది. ముద్దమోముతో పలికే పలుకులు మరింత ముద్దుగా ఉండేవని అభిమానులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. సరోజాదేవి ముద్దుముద్దు మాటలకు ఫిదా అయిన తమిళ ఇండస్ట్రీ ఆమెను ‘కన్నడత్తు పాయింగిళి’ (కన్నడ చిలుక) అని పిలుచుకుంది. సరోజాదేవి సహజ అందానికి ఫిదా అయిన ఉత్తరాది పత్రికలు ఆమెను ‘మద్రాస్ కా సుందర్ తార’ అని అభివర్ణించాయి. సరోజాదేవి సినీరంగ సేవలకు గుర్తుగా 1969లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్ అవార్డులు ఆమెను వరించా యి. 60వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జీవిత సాఫల్య పురస్కారం దక్కటమే కాక ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, మరెన్నో గొప్ప అవార్డులు కూడా సరోజాదేవి కీర్తి కిరీటంలో చేరింది.
చిత్రసీమపై తనదైన ముద్ర..
సరోజాదేవి కన్నుమూశారని తెలిసి బాధపడ్డాను. తెలుగు, కన్నడ, తమిళ చిత్రాల్లో నటించి చిత్రసీమపై తనదైన ముద్ర వేశా రామె. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.
పవన్‌కల్యాణ్ (ఏపీ డిప్యూటీ సీఎం)
గొప్ప సినిమాలు గుర్తుకొచ్చే పేరు..
సరోజాదేవి ఇక లేరనే వార్త బాధించింది. భాషతో సంబంధం లేకుండా అభిమానులను సొంతం చేసుకున్నారామె. ఆమె పేరు చెప్పగానే ఎన్నో గొప్ప సినిమాలు గుర్తుకొస్తాయి. ఆమె మరణం పరిశ్రమకు తీరని లోటు.
సిద్ధరామయ్య (కర్ణాటక సీఎం)
రాబోయే తరాలకు స్ఫూర్తి..
దక్షిణ భారత ధ్రువతారగా వెలిగిన సరోజాదేవి మరణ వార్త అత్యంత బాధాకరం. మా నాన్న ఎన్టీఆర్ కాంబినేషన్‌లో 20 ఏళ్లలో దాదాపు 20 సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు. ఆయనతో శ్రీరాముడి పక్కన సీతాదేవిగా, రావణాసురుడి పక్కన మండోదరిగా నటించిన ప్రత్యేకత ఆమె సొంతం. సరోజాదేవి జీవితం రాబోయే తరాలకు స్ఫూర్తి.
నందమూరి బాలకృష్ణ
నాకు తల్లితో సమానం..
సరోజాదేవి నన్నెప్పుడూ ప్రేమగా పలకరిం చేవారు. ఆమె నాకు తల్లితో సమానం. ఆమెతో ఎన్నో జ్ఞాపకాలున్నాయి. ఆమె లేరనే వార్త విన్నప్పట్నుంచీ కన్నీళ్లు ఆగడంలేదు. నేను మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకున్న మా అమ్మకు బాధాతప్త హృదయంతో వీడ్కోలు పలుకుతున్నా.
కమల్‌హాసన్