26-07-2025 12:00:00 AM
ఇందిరమ్మ ఇల్లు త్వరగా పూర్తి చేయాలని ఆదేశం..
అదిలాబాద్, జూలై 25 (విజయక్రాంతి): యూరియా నిల్వలు కనీసం నాలుగు రోజులకు సరిపడే విధంగా ఉంచాలని, అదేవిధం గా రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. ఇచ్చోడ మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కేంద్రంలో ఉన్న యూరియా నిల్వలను, పాస్ యంత్రాన్ని, సంఘానికి సంబంధించిన వివిధ రికార్డులను పరిశీలించారు. అనంతరం ఇచ్చోడ మండలం ముక్ర (బి), నవేగామ్ గ్రామాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల ను జిల్లా కలెక్టర్ రాజర్షి షా సందర్శించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు.
పేద ప్రజల స్వంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ పథకం క్రింద జరుగుతున్న నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, ప్రతి గృహ నిర్మాణం లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ట్రైనీ కలెక్టర్ సలోని, తహసిల్దార్ సత్యనారాయణ, ఎంపీడీవో, గ్రామ పంచాయతీ అధికారులు, తదితరులు ఉన్నారు.