చేతికొచ్చే పంట.. నేల వాలింది
గాలివానతో రైతులకు తీవ్ర నష్టం
నిర్మల్/తలమడుగు, ఫిబ్రవరి ౨౪ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి కురిసిన వడగళ్ల గాలివాన రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. యాసంగిలో సాగుచేసిన మొక్కజొన్న. వరి. నువ్వు జొన్న పంటలు రాళ్ల వర్షం బలమైన గాల్పుల కారణంగా నేలకు వాలాయి.
జిల్లాలోని సోన్ లక్ష్మణ్ చందా నరసాపూర్ లోకేశ్వరం కుంటాల మామడ తానూర్ భైంసా కుబీర్ తదితర మండలాల్లో పంటలు దెబ్బతిన్నట్టు రైతులు పేర్కొన్నారు. పంటలు ఎదుగుతున్న దశలో కురిసిన వర్షం వరణంగా మార్కెట్కు తరలించేందుకు ఆరబోసిన పసుపు తడిసి ముద్ద కావడంతో రంగు మారే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
బలమైన గాలుల వల్ల పంటలు నేల వాళ్ళడంతో ఎదుగుదలపై ప్రభావం చూపుతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. మామిడి చెట్లకు పిందెలు కాస్తున్న సందర్భంగా ఈ గాలివాన బీభత్సం కారణంగా అవి నేల వాలినట్టు మామిడి రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇదిలా ఉండగా జిల్లా వ్యాప్తంగా దెబ్బతిన్న పంటలను వ్యవసాయ శాఖ అధికారులు మంగళవారం ప్రాథమిక నివేదికను జిల్లా కలెక్టర్కు అందించినట్టు జిల్లా అధికారి అంజి ప్రసాద్ తెలిపారు.
దెబ్బతిన్న మొక్కజొన్న పంట..
తలమడుగు మండల వ్యాప్తంగా గత రాత్రి కురిసిన వడగళ్ళ వర్షానికి మొక్క జొన్న, జొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మండలంలోని సుంకిడి గ్రామానికి చెందిన రైతు ఆర్థుల కృష్ణ 6 ఎకరాల భూమిని కౌలు కు తీసుకోని మొక్క జొన్న సాగు చేస్తున్నారు. సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షం, ఈదురుగాలులకు మొక్కజొన్న పంట తీవ్రంగా దెబ్బతిందని, ఐదు ఎకరాల్లో పంట నేలపాలైంది. నెలపాలైన మొక్క జొన్న కర్రలను పైకి లేపారు.
కౌలుకు తీసుకుని సాగు చేసిన పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షం ముంచెత్తడంతో రైతు కృష్ణ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మంగళవారం కిసాన్ సెల్ కోఆర్డినేటర్ మేకల రమాకాంత్ యాదవ్ నష్టపోయిన మొక్క జొన్న పంటను రైతు తో కలిసి పరిశీలించారు. అధికారులతో సర్వే చేపించి రైతుకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ఆయన కోరారు.




