ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీని విస్తరించిన ఘనత కేసీఆర్‌దే..
ఆదిలాబాద్‌లోని ఐటీ టవర్‌ను పరిశీలించిన కేటీఆర్
ఆదిలాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): హైదరాబాద్ పట్టణంతో పాటు రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటి రంగాన్ని విస్తరించేలా చర్యలు చేపట్టిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతోందని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నా రు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఐటీ టవర్ ను కేటీఆర్ పరిశీలించారు. నిర్మాణ పురోగతి, తదితర అంశా లపై మాజీ మంత్రి జోగు రామన్న తదితరులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దూర దృష్టితో రాష్ట్రంలోని పది ప్రాంతాల్లో ఐటీ టవర్ లను నిర్మించాలన్న ఆలోచన చేశారని తెలిపారు. ఆదిలాబాద్ వంటి వెనుకబడిన జిల్లాలోనూ ఐటీ ఫలాలు అందాలన్న ఆలోచనతో మాజీ మంత్రి జోగు రామన్న కోరిక మేరకు జిల్లా కేంద్రంలో తమ ప్రభుత్వ హాయంలో ఐటీ టవర్ ను మంజూ రు చేశామన్నారు. ప్రస్తుతం మొదటి దశ పను లు కొనసాగుతున్నాయన్నారు. 700 మంది యువతి, యువకులకు ఉపాధి కల్పించే విధంగా ఇక్కడ ఐటీ టవర్‌ను నిర్మించేందుకు చర్యలు చేపట్టామన్నారు. రెండో దశలోనూ పూర్తి నిర్మాణం జరిగితే6,000 నుంచి 7000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు.
నిజామాబాద్‌లో నిర్మించిన ఐటీ టవర్ లో ఇంకా ఉద్యోగాల భర్తీ జరగలేదని, నిజామాబాద్‌తో పాటు ఆదిలాబాద్ జిల్లాలో నిర్మించిన ఐటీ టవర్ లో ఉద్యోగాల నియామకాన్ని పూర్తి చేయాలన్నారు. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీని పున :ప్రారంభించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనన్న ఆయన.. ఫ్యాక్టరీ పునరుద్ధరణలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని పేర్కొన్నారు. ఆయన వెంట మాజీ మంత్రులు జోగు రామన్న, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు జాన్సన్ నాయక్ తదితరులు ఉన్నారు.




