01-05-2025 01:15:56 AM
శ్రీనగర్, ఏప్రిల్ 30: పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేయడానికి కశ్మీర్ నుంచి పారిపోయి పాక్‌లో స్థిరపడిన ఒక ఉగ్రవాది నెట్‌వర్క్ సాయపడినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది. లష్కరే తోయిబాకు చెందిన కమాండర్ ఫరూఖ్ అహ్మద్ తేడ్వా కూడా ఈ దాడిలో కీలకపాత్ర పోషించినట్టు భావిస్తున్నారు. ఇటీవలే భద్రతా దళాలు కుప్వారాలో అతడి ఇంటిని పేల్చేశాయి.
గత రెండేళ్లలో కశ్మీర్‌లో చాలా మంది ఉగ్రవాదులకు అతడు సాయం చేసినట్టు గుర్తించారు. ఫరూఖ్‌కు కశ్మీర్‌లోని పర్వతాలు, లోయల్లో మార్గాలపై మంచి పట్టు ఉంది. ఉగ్రవాదులు మూడు మార్గాల ద్వారా భారత్‌లో చొరబడేందుకు ఫరూఖ్ సాయమందించాడు. పాక్‌లో కూడా ఫరూఖ్‌కు బలమైన సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. 1990-2016 మధ్య ఇరుదేశాలకు పలుమార్లు ప్రయాణించాడు.
పహల్గాంలోని ఉగ్రదాడి తర్వాత అతడికి సాయం చేసిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పాక్‌లో స్థిరపడిన ఫరూఖ్ కశ్మీర్‌లోని తన నెట్‌వర్క్‌తో సంబంధాలు పెట్టుకునేందుకు సెక్యూర్డ్ కమ్యూనికేషన్ యాప్స్ వినియోగిస్తున్నాడు. ఇక దాడికి పాల్పడిన ఉగ్రవాదుల వద్ద ఆల్పైన్ క్వెస్ట్ వంటి నేవిగేషన్ యాప్‌ను ఆఫ్‌లైన్ మోడ్‌లో వినియోగించినట్టు భావిస్తున్నారు.