03-09-2025 10:46:45 AM
ముగ్గురు పిల్లలతో కలిసి అలిగి వచ్చిన తండ్రి.
అనుమానాస్పద స్థితిలో తండ్రి మృతి, ముగ్గురు చిన్నారుల ఆచూకీ గల్లంతు.
వెల్దండ మండలంలో ఘటన.
ప్రకాశం జిల్లా వాసిగా గుర్తింపు.
నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి తన ఇద్దరు కూతుళ్లు కుమారుడితో కలిసి ఆంధ్ర రాష్ట్రం ప్రకాశం జిల్లా నుండి బైక్పై వచ్చి అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) వెల్దండ మండలం పెద్దాపురం గ్రామ శివారులోని పెట్రోల్ బంక్ ముందు ఉన్న కుంట వద్ద బుధవారం వెలుగు చూసింది. కానీ తనతో పాటు ముగ్గురు చిన్నారుల ఆచూకీ మాత్రం గల్లంతయ్యింది. స్థానికుల సహకారంతో సమాచారాన్ని అందుకున్న వెల్దండ పోలీసులు వెంటనే ఘటనా స్థలం వద్ద మృతదేహాన్ని పరిశీలించగా ప్రకాశం జిల్లా ఎర్రగుంట్ల పాలెం మండలం బోయలపల్లి గ్రామ వాసి గుప్త వెంకటేశ్వర్లు(35)గా గుర్తించారు.
గత కొద్ది రోజుల క్రితం కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య దీపికతో కలిసి గొడవపడి పెద్ద కుమార్తె మోక్షిత(8), రఘు వర్షిణి (6), కుమారుడు శివ ధర్మ (4)లను వెంటబెట్టుకొని బైక్ పై నాగర్ కర్నూల్ జిల్లా డిండి ప్రాజెక్టు వద్దకు వచ్చారు. గత నాలుగు రోజులుగా హాజీపూర్, డిండి పరిసరాల్లోనే తిరిగినట్లు సిసి పుట్టేజి ఆధారంగా పోలీసులు గుర్తించారు. కాగా బుధవారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో వెల్దండ మండలం పెద్దాపురం గ్రామ శివారులో విగత జీవిగా పడి ఉండడం తన పక్కనే పురుగుల మందు డబ్బా కనిపించడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లుగా ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు.
కానీ తన వెంట వచ్చిన ముగ్గురు చిన్నారులు పరిస్థితి ఏంటని పోలీసులు ఆరా తీస్తున్నారు. మొదటగా చిన్న కుమార్తె కుమారుడిని హాజీపూర్ వద్ద పెట్రోల్ బంక్ సమీపంలో వదిలి పెట్రోల్ పోయించుకొని వస్తామంటూ విడిచి వెళ్లినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు కానీ పెద్ద కుమార్తె వెంటబెట్టుకొని వచ్చిన తాను కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సొంత గ్రామంలో భార్య దీపిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకోగా ఆ ప్రాంత పోలీసులు సైతం ఘటన స్థలికి చేరుకున్నారు. మృతుడు సొంత మండల కేంద్రంలో ఫర్టిలైజర్ దుకాణా దారుడిగా పనిచేస్తున్నట్లు తెలిపారు.