calender_icon.png 3 September, 2025 | 4:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్‌కు సామాజిక తెలంగాణ అవసరం లేదా?

03-09-2025 12:44:02 PM

 సామాజిక తెలంగాణకు కట్టుబడి ఉన్నా.. దాంట్లో తప్పేముంది?

ఉద్యమాలు ఎలా చేయాలని.. నా తండ్రి చిటికెనవేలు పట్టుకుని నేర్చుకున్నా

బంగారు తెలంగాణ అంటే.. హరీశ్, సంతోష్ ఇంట్లో బంగారం ఉంటే సరిపోతుందా?

హైదరాబాద్: బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) పార్టీకి సామాజిక తెలంగాణ అవసరం లేదా? భౌగోళిక తెలంగాణ వస్తే సరిపోతుందా?, బంగారు తెలంగాణ అంటే హరీశ్ రావు, సంతోష్ ఇంట్లో బంగారం ఉంటే సరిపోతుందా? అని కవిత(Kalvakuntla Kavitha) ప్రశ్నించారు. ప్రతి సమాజం బాగుంటేనే బంగారు తెలంగాణ అవుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి(Telangana Jagruthi) కార్యాలయంలో కవిత మీడియా సమావేశం నిర్వహించారు. నిన్న మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రకటన వచ్చింది. నన్ను సస్పెండ్  చేస్తూ బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన వచ్చిందన్నారు. నాపై అక్రమ కేసులో పెడితే ఐదున్నర నెలలు తీహార్ జైలులో ఉన్నాను. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ఉద్యమం చేశాం, పేదవాళ్లకు పింఛన్లు పెంచాలని ఉద్యమం చేశామని అన్నారు. మహిళలకు రూ. 2500 ఇవ్వాలని పోస్టుకార్డు ఉద్యమం చేసినట్లు పేర్కొన్నారు. 2024 నవంబర్ 23 నుంచి ప్రజాక్షేత్రంలోకి వచ్చి అనేక కార్యక్రమాలు చేశానని చెప్పారు. గురుకులాల్లో జరిగిన అన్యాయాలపై మొట్టమొదట మాట్లాడానని తెలిపారు. తెలంగాణ తల్లి స్వరూపాన్ని మారిస్తే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టామన్నారు.

బనకచర్లపైనా సమావేశాలు ఏర్పాటు చేసి మాట్లాడానని గుర్తుచేశారు. భద్రాచలం వద్ద ఐదు గ్రమాల ముంపు సమస్యపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చానని పేర్కొన్నారు. పర్యటనలకు వెళ్లినప్పుడు ప్రజా సమస్యలపై అందరినీ కలుపుకుని సమావేశాలు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ లో భూ నిర్వాసితులకు మద్దతుగా పోరాడామన్నారు. సామాజిక తెలంగాణకు కట్టుబడి ఉన్నా.. దాంట్లో తప్పేముంది? అని ప్రశ్నించారు. ఉద్యమాలు ఎలా చేయాలని.. నా తండ్రి చిటికెనవేలు పట్టుకుని నేర్చుకున్నా.. మా నాయకుడిని స్ఫూర్తిగా తీసుకునే సామాజిక తెలంగాణపై మాట్లాడా అన్నారు. దళితులకు మూడు ఎకరాలు ఇస్తామని చెప్పిన ఏకైక గొప్ప నాయకుడు కేసీఆర్ అన్నారు. బీసీలకు చేయూతనిస్తానని చెప్పి డబ్బులు ఇచ్చిన ఏకైక వ్యక్తి కేసీఆర్ అని పేర్కొన్నారు. సామాజిక తెలంగాణపై మాట్లాడితే పార్టీ పెడుతున్నానని దుష్ప్రచారం చేశారని ఆరోపించారు.