03-09-2025 12:19:01 PM
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జీఎస్టీ కౌన్సిల్(GST Council Meeting 2025) సమావేశం కొనసాగుతోంది. జీఎస్టీ కౌన్సిల్ భేటీకి తెలుగు రాష్ట్రాల ఆర్థికమంత్రులు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka), పయ్యావుల కేశవ్ హాజరయ్యారు. జీఎస్టీ శ్లాబ్ లలో భారీ మార్పులు చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న 12 శాతం, 28 శాతం శ్లాబ్ లను కౌన్సిల్ రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రెండు శ్లాబుల్లోని ఉత్పత్తులను 5 శాతం, 18 శాతం శ్లాబ్ లోకి మార్చే అవకాశం ఉంది. పొగాకు లగ్జరీ ఉత్పత్తులపై 40 శాతం జీఎస్టీ కొనసాగించాలని కౌన్సిక్(GST Council Meeting) కు సూచనలు చేశారు. పలు రాష్ట్రాల మంత్రులతో కూడిన జీఎస్టీ ఉపసంఘం ఇప్పటికే సూచనలు చేసింది. నిర్ణయాలకు ఆమోదం వస్తే ఆటోమెబైల్ రంగంలో కీలక మార్పులకు అవకాశముంది. హైబ్రిడ్ కార్లు, మోటార్ సైకిళ్లపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని ఉపసంఘం సూచించింది. పాలు, పాల ఉత్పత్తులపై, జీవిత బీమాపై జీఎస్టీ శ్లాబ్ ల్లో మార్పులకు అవకాశముంది. సుమారు 500 ఉత్పత్తులపై జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకోనుంది. జీవితబీమాపై పన్ను పూర్తిగా ఎత్తివేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. సమావేశం తొలి భాగంలోనే ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది.