03-09-2025 12:31:05 PM
జిన్నారం (విజయక్రాంతి): బొల్లారం మున్సిపల్(Bollaram Municipality) పరిధిలోని గాంధీనగర్ సమీపంలో ఉన్న డంపింగ్ యార్డును తరలించాలని కాలనీవాసులు ఆందోళన చేశారు. డంపింగ్ యార్డ్ నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తుండడంతో కాలనీవాసులు ఆగ్రహానికి గురై ప్లకార్డులతో బుధవారం ఉదయం ధర్నా, నిరసన ర్యాలీ నిర్వహించారు. మహిళలు, చిన్నారులు సైతం ఈ ఆందోళనలో పాల్గొన్నారు. తక్షణమే డంపింగ్ యార్డ్ ని ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. డంపింగ్ యార్డ్ ను తరలించకపోతే నిరసనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.