29 March, 2026 | 8:33 AM

కాంగ్రెస్‌కు కర్రుకాల్చి వాత పెట్టుడే

04-05-2024 01:01 AM

సింగరేణి సంస్థను కాపాడింది నేనే

రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీకి ఘోరీ కట్టాలి

లేదంటే రాష్ట్రానికి పెను ప్రమాదమే

మళ్లీ రాబోయేది బీఆర్‌ఎస్ రాజ్యమే

తెలంగాణను ఆగం చేస్తే ఊరుకోను

గోదావరిఖని రోడ్ షోలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్

మంథని, మే 3 (విజయక్రాంతి): ‘కేసీఆర్‌ను తక్కువ అంచనా వేస్తున్నరు. నన్ను ఎదుర్కోలేక మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చి తెలంగాణను ఆగమాగం పట్టిస్తున్నరు. కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒక్కటే. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఆలోచన చేసి బీఆర్‌ఎస్‌ను గెలిపించుకోవాలె. లేదంటే పెద్ద ప్రమాదం ఎదుర్కోవాల్సి వస్తది. ఒక్కటి రాసి పెట్టుకోండి. మళ్లీ బీఆర్‌ఎస్ రాజ్యమే రాబోతుంది’ అని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తాను ఏ పాపం చేశానని గొంతు నొక్కేందుకు 48 గంటలపాటు ప్రచారంపై నిషేధం విధించారని ప్రశ్నించారు.

25 ఏండ్లు సింగరేణి కార్మికుడిగా పనిచేసిన సౌమ్యుడు కొప్పుల ఈశ్వర్‌ను ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ప్రచారంపై 48 గంటల నిషేధం తర్వాత శుక్రవారం రాత్రి గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో కేసీఆర్ రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ణోక్షూ రైతుబంధు, సాగునీరు ఇవ్వకుండా రైతులను ఆగం పట్టిస్తున్నదని విమర్శించారు. డిసెంబర్ 9న రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి మళ్లీ ఆగస్టు 15కు వాయిదా వేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 

తులం బంగారం ఇచ్చారా?

సీఎం రేవంత్‌రెడ్డి గమ్మత్తు చేస్తున్నారని, ఏ ఊరుకు వెళ్తే ఆ ఊరు దేవుడి మీద ఒట్టు వేయడం విడ్డూరంగా ఉన్నదని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ‘నున్నుమాత్రం వాళ్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు. నేను ఒక్క మాట అనేసరికి వెన్నులో ఓటమి భయం పుట్టి 48 గంటలు బస్సు యాత్ర చేయకుండా ఆపారు. కానీ ప్రజల్లో ఉన్న ఆదరణను మాత్రం ఆపలేరు’ అని స్పష్టంచేశారు. కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలంటే  ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్‌ను గెలిపించాలని కోరారు. చావు నోట్లో తల పెట్టి తెలంగాణను తెచ్చి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ల చేతిలో పెడితే రైతుబంధు,దళితబంధు, కల్యాణలక్ష్మి ఇవ్వకుండా ప్రజలను ఆగమాగం పట్టిస్తున్నారని విమర్శించారు. దళితులు ఏం పాపం చేశారని దళితబంధు రద్దుచేశారు? అని ప్రశ్నించారు.

తులం బంగారం ఇస్తామన్నారు కదా.. ఇచ్చారా? అని నిలదీశారు. దళితులు ఆర్థికంగా ఎదుగుతుంటే ఓర్వలేక దళితబంధు ఆపివేశారని, తాను దళితబంధు డబ్బులు విడుదలచేస్తే సీఎం రేవంత్‌రెడ్డి మళ్లీ ఆ డబ్బులను వాపస్ తెచ్చుకున్నారని ఆరోపించారు. సింగరేణి సంస్థ ఇప్పుడు పెద్ద ప్రమాదంలో ఉందని, ఆ సంస్థను కాపాడుకోవాలంటే బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, జడ్పీ చైర్మన్ పుట్ట మధు, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, బాల్క సుమన్, దాసరి మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.