15-09-2025 07:06:01 PM
ఐక్య విద్యార్థి సంఘాలు
హనుమకొండ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న బోధన బకాయిలు ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని కేయూ రీసెర్చ్ స్కాలర్స్, ఐక్య విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కేయూ గెస్ట్ హౌస్ వద్ద పరిశోధక విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పెండింగ్ లో ఉన్న ఎనిమిది వేల కోట్ల రూపాయల ఫీజులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని, సంక్షేమ పథకాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం విద్యకు మాత్రం ఎందుకు సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తుందని విమర్శించారు. విద్యారంగం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ విద్యార్థుల సమస్యలను మాత్రం పట్టించుకోవడంలేదని, గత ప్రభుత్వం మీద నింద వేస్తూ తప్పించు కుంటుందని, గతంలో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తున్న ప్రభుత్వం ఫీజులు విడుదల మాత్రం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు.
విద్యను, విద్యార్థులను నిర్లక్ష్యం చేయడం కోసమే ప్రభుత్వం కుట్ర పన్ను ఉందని అన్నారు. ఫీజుల విడుదల కోసం అనేకసార్లు ఆందోళనలు చేసి విన్నవించుకున్న ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడిన చందంగా వ్యవహరిస్తుందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుంటే విద్య ఏ రకంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. విద్యారంగం పట్ల కాంగ్రెస్ హామీలు కోటలు దాటిన అమలు మాత్రం గడప దాటడం లేదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వీడి పెండింగ్ లో ఉన్న బోధన బకాయిలు ఉపకార వేతనాలను విడుదల చేయాలని బడ్జెట్లో కేటాయించిన 1200 కోట్ల తక్షణమే చెల్లించాలని, ప్రైవేటు కాలేజీల యజమాన్యాలతో చర్చలు జరిపి సమ్మెను విరమింప చేయాలని డిమాండ్ చేశారు. ఫీజులు విడుదల చేయాలని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరవధిక విద్యాసంస్థల బంద్ కు కాకతీయ యూనివర్సిటీ రిసర్చ్ స్కాలర్స్, విద్యార్థి సంఘాల తరఫున మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆరేగంటి నాగరాజు, రీసెర్చ్ స్కాలర్స్ డి.తిరుపతి, కేతపాక ప్రసాద్, బి.శ్రీదేవి, ఏఐడీఎస్ఓ రాష్ట్ర కన్వీనర్ ఏ. సత్యనారాయణ, పిడిఎస్ యు, జిల్లా కార్యదర్శి మర్రి మహేష్, ఎస్ ఎస్ యు జిల్లా అధ్యక్షులు ఎల్తూరి సాయి కుమార్, డీ ఎస్ ఏ హనుమకొండ జిల్లా కన్వీనర్ ఉప్పుల శివ, నాయకులు ఓ. చిరంజీవి, బొక్క ప్రవర్ధన్, సిహెచ్ రాజ్ కుమార్ అభినయ్, పాల్గొన్నారు