27-11-2025 12:19:19 AM
-యంత్రాలతో సింగరేణి అధికారుల వ్యాపారం
-కాంట్రాక్టర్ల లాభమే.. సింగరేణి ధ్యేయమా..?
-బినామీ కాంట్రాక్టు పనులు
-అధికారుల ఇష్టారాజ్యం.. నిబంధనల ఉల్లంఘన
-ఇదీ సింగరేణి యాజమాన్యం తీరు
బెల్లంపల్లి అర్బన్, నవంబర్ 26: సింగరేణిలో ఉన్నతాధికారుల ఇష్టారాజ్యం పెట్రేగి పోతోంది.. యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. కొందరి అధికారు ల సొంత లాభం కోసం సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో నిర్వహణకు మంగళం పాడుతున్నారు. ఆ స్థానంలో కాంట్రాక్టీకరణకు అవకా శం కల్పిస్తున్నారు. ఆ కాంట్రాక్టీకరణ పనులు కూడా అధికారులే చేపడుతున్నారు. స్వయా న కొందరు పెద్ద స్థాయి అధికారులే ఈ పను లు చేపట్టడం వివాదాస్పదంగా కనిపిస్తోంది. కాంట్రాక్టు పనులు బినామీల మాటున చేస్తున్నారని సమాచారం.
యాజమాన్యం భాగస్వామ్యంలో ఉంటూ నే సింగరేణిలో ఓ అధికారి ఇలా గుత్తేదారు అవతారామెత్తారు. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిలో వచ్చిన యాంత్రీకరణను తమ సొంత లాభం కోసం ఇలా అందిపుచ్చుకొంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యాజ మాన్య, అధికార బలంతోనే కాంట్రాక్టు పనులను కైవసం చేసుకున్నారన్న విమర్శలు లేకపోలేదు. సింగరేణి భూగర్భ గనుల్లో కోల్ ఫిల్లింగ్ విధానానికి స్వస్తి పలికారు. దాని స్థానంలో ఎస్ డీ ఎల్ యంత్రాలను తీసుకొచ్చారు. ప్రారంభంలో ఈ పనులు సింగరేణి నిర్వహణలోనే జరుగుతుండేవి, భూగర్భ గనుల్లో ఎస్ డీ ఎల్ యంత్రాలతోనే బొగ్గు ఉత్పత్తి చేపట్టారు. అందులో భాగంగానే శాంతిఖనిలో కూడా అమలు చేశారు.
అందుకు కోసం కోల్ ఫిట్టర్ లను ఆపరేటర్లుగా మార్చేందుకు నైపుణ్య శిక్షణ ఇచ్చారు. సింగరేణిలో ఇంజనీరింగ్ వ్యవస్థను మరింత ఆధునీకరించి బలోపేతం చేశారు. ఇలా సింగరేణిలో ఏకైక ఉత్పత్తి సాధనాల్లో ఎస్ డీ ఎల్ యంత్రాలే కీలకంగా మారిపోయాయి. అందుకు సాంకేతికంగా పెద్దపీట వేశారు. ప్రత్యామ్నాయ బొగ్గు ఉత్పత్తి సాధనాలుగా ఎస్ డీ ఎల్ యంత్రాలనే ముందుకు తెచ్చారు. ఇంత ప్రాదాన్యత ఇచ్చిన యాజమాన్యం కొంత కాలానికే మళ్ళీ రూటు మార్చింది.
సింగరేణి ఎస్ డీ ఎల్ యంత్రాల బొగ్గు ఉత్పత్తి ప్రక్రియను ప్రైవేటీకరించారు. దీనిని కొందరు సింగరేణి అధికారులు, రిటైర్డు అధికారులు సొంతం చేసుకున్నారు. బాధ్యతలను విస్మరించి యంత్రాలతో వ్యాపారాలకు దిగారు. సింగరేణిలో కొత్తగా రంగప్రవేశం చేసిన ఎస్ డీ ఎల్ పనుల ప్రైవేటీకరణలో భాగస్వామ్యం పొందారు. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆధునిక ప్రధాన పనిముట్లు ఇప్పుడూ ఎస్ డీ ఎల్ యంత్రాలే కావడం గమనార్హం.
అధికారులకు ఓ రూల్.. కార్మికులకు మరో రూల్..?
సింగరేణిలో చిన్న చిన్న రప్పిదాలకే కార్మికులపై చర్యలు తీసుకోవడం సాధారణమే... అదే అధికారులు ఎంత పెద్ద తప్పులు చేసినా మాఫీ అన్నట్లే.., వారి పై చర్యలు ఉండవు,,. అధికారులు ఏం చేసినా అది చట్టబద్ధమైపోతుంది... వారేమి చేసినా ఎదురు లేదు... ఆడిందే ఆటగా పాడిందే పాటగా అధికారికంగా చలామణి అవుతుంది. సింగరేణిలో ఈ ద్వంద్వ నీతి ‘మూడు పూలు - ఆరు కాయలు గా‘ కొనసాగుతుంది. ఎస్ డీ ఎల్ యంత్రాల కాంట్రాక్టు పనులను సాక్షాత్తు సర్వీసులో ఉన్న ఓ ఉన్నత అధికారే గుత్తేదారు కావడం సింగరేణిలో చర్చనీయాంశంగా మారింది. ఎస్ డీ ఎల్ గుత్తేదారు ప్రధాన అధికారి అనే ప్రచారం సింగరేణిలో కోడైకూస్తోంది... ఇదంతా యాజమాన్యం కనుసన్నల్లోనే జరిగిందనడంలో సందేహం లేదు.
ఈ నేపథ్యంలో యాజమాన్యం తీరుపై సింగరేణిలో విమర్శలు పెల్లుబితున్నాయి. సదరు అధికారి గుత్తేదారు నిర్వహణలో సింగరేణిలోని 11 ఏరియాల్లోనూ, కొన్ని భూగర్భ గనుల్లో ఇప్పటికే పనులు సాగుతోన్నాయి. భూపాలపల్లిలోని కేటికే 5, కేటీకే 8 గనులతో పాటు ఇతర ప్రాంతాల్లో పనులు జరుగుతున్నాయి. సింగరేణి మార్గ నిర్దేశక బృందంలో ప్రధాన బాధ్యతల్లో ఉన్న ఉన్నతాధికారులు ఇలా గుత్తేదారు పనులు చేపట్టడంపై కార్పోరేట్ యాజమాన్యం ఎలా అవకాశం ఇస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. సర్వీసులో ఉండీ, గుత్తేదారు చేయడానికి నిబంధనలు ఎలా ఒప్పుకుంటాయనే ప్రశ్నలు షికార్లు చేస్తున్నాయి.
లీగల్ గా దొరక్కుండా సాంకేతీక జాగ్రత్తలు తీసుకొని ఇద్దరిని బినామీగా పెట్టీ సదరు అధికారి ఎస్ డీ ఎల్ గుత్తేదారు పనులు చేయిస్తున్నారు. గుత్తేదారుగా బయటకు కనిపించకుండా ఆ అధికారి తెలివిగా వ్యవహరిస్తున్నారు. పిల్లి కళ్లు మూసుకుని ఎంతకాలం పాలుతాగదనే సామెత ఆ అధికారి వ్యవహారాన్ని గుర్తు చేస్తుంది. సింగరేణిలో ఇంత పెద్దఎత్తునా జరుగుతున్న నిబంధనల ఉల్లంఘన, బాధ్యత రాహిత్యంపై యాజమాన్యం మౌనం సింగరేణిలో వాడివేడిగా చర్చకు తెరలేపలేకపోయింది.
ఈ విషయంపై తమతోటి అధికారి అనే పక్షపాతమా..? లేక అందులో వారికి కూడా ఏమైనా వాటాలు ఉన్నాయా..? లేదా ఈ తరహా పనులే.. మిగిలిన అధికారులు కూడా చేస్తున్నారా..? అందుకే ఈ మౌనమా..? ఇలా అనేక సవాలక్ష ప్రశ్నలు సింగరేణీ యజమాన్యం తీరుపై తలెత్తుతున్నాయి. ఈ ప్రశ్నల వెనుక అనుమానాలను నిగ్గుతేల్చి, నివృత్తి పరిచే బాధ్యత సింగరేణి యాజమాన్యానిదే. ఈ విషయంపై రియాక్షన్ ఎలా ఉంటది, ఏమి చేస్తదనే దానిపై సింగరేణి లోకం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుంది.
నిబంధనలకు పూర్తి విరుద్ధంగా..
సింగరేణిలోని ఓ ప్రధాన అధికారే కాంట్రాక్టర్‌గా అవతారమెత్తారు. రూ. 300 కోట్లతో సింగరేణిలో ప్రైవేటీకరణ పనులను గత ఏడాది చేజిక్కించుకున్నారు. ఈ కాంట్రాక్టు పనులను తన బినామీలతో సాగిస్తున్నారు. సింగరేణిలో కాంట్రాక్ట్ పనులు అధికారు లు తీసుకోవడం నిబంధనలకు పూర్తి విరుద్ధం. సింగరేణి వ్యాప్తంగా ఎస్డీఎల్ యంత్రాల బొగ్గు ఉత్పత్తి పనులను ఓ కాంట్రాక్టర్, మరో సింగరేణి రిటైర్డ్ అధికారితో కలిసి సింగరేణి ఉన్నతాధికారి నిర్వహిస్తున్నారు. సదరు రిటైర్డ్ అధికారి, సింగరేణి పెద్ద సారూ కావడం సింగరేణిలో గాడితప్పుతోన్న అధికార దుర్వినియోగానికి నిదర్శనంగా పేర్కొనవచ్చు. సదరు పెద్ద సారూ, బినామీలో కీలక మైన రిటైర్డు అధికారి, పూర్వం బెల్లంపల్లి శాంతిఖనిలో వేరు వేరూ రంగాల్లో కీలకమైన బాధ్యతలను నిర్వహించిన వారే...