calender_icon.png 27 November, 2025 | 5:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ

27-11-2025 12:44:36 AM

  1. ట్రెయినింగ్, జాబ్ పేరుతో నిరుద్యోగులకు వల 
  2.   400 మంది బాధితులు, ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షలు వసూలు 
  3.   12 కోట్లతో పరారైన డైరెక్టర్ స్వామినాయుడు 
  4. సైబరాబాద్ సీపీకి బాధితుల ఫిర్యాదు

శేరిలింగంపల్లి, నవంబర్ 26 (విజయక్రాంతి): సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరుతో అమాయక విద్యార్థులను, నిరుద్యోగులను నిలువునా ముంచారు. మాదాపూర్ కేంద్రంగా నడుస్తున్న ‘ఎన్‌ఎస్‌ఎన్ ఇన్ఫోటెక్’ కంపెనీ.. ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి కోట్లలో వసూళ్లకు పాల్పడి, రాత్రికిరాత్రే బోర్డు తిప్పేసింది. ఎన్‌ఎస్‌ఎన్ ఇన్ఫోటెక్ పేరుతో నకిలీ కంపెనీని నెలకొల్పి నిరుద్యోగులకు శిక్షణ, ఉద్యోగం హామీ పేరుతో 400 మంది నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.3 లక్షల చొప్పున కోట్లాది రూపాయలు వసూలు చేసి రాత్రికి రాత్రి పరారయ్యాడు కంపెనీ యజమాని.

గత కొన్ని నెలల క్రితం మాదాపూర్ లోని ఓ కమర్షియల్ భవనంలో ‘ఎన్‌ఎస్‌ఎన్ ఇన్ఫోటెక్’ ఆఫీస్‌ను ఏర్పాటు చేశారు. ఐటీ కంపెనీలా కనిపించేలా ఇంటీరియర్, సిబ్బంది, క్లాస్‌రూమ్‌లను ఏర్పాటు చేశారు. సంస్థ డైరెక్టర్ స్వామినాయుడు అందరితో నమ్మకంగా ప్రవర్తిస్తూ వచ్చాడు.

ఫుల్‌స్టాక్ డెవలప్‌మెంట్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి హై-డిమాండ్ కోర్సులకు శిక్షణ ఇస్తామంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. శిక్షణ తర్వాత తమ కంపెనీలోనే ఉద్యోగం ఇస్తామని ప్రత్యేక హామీ ఇచ్చాడు. ఈ నమ్మకంతో ఒక్కో విద్యార్థి నుంచి రూ.౩ లక్షల వరకు ఫీజులు వసూలు చేశారు. మొత్తం 400 మంది నుంచి సుమారు రూ.12 కోట్ల వరకు సేకరించారని సమాచారం.

బోర్డు తిప్పేసి రాత్రికిరాత్రే పరార్

అయితే బుధవారం తరగతులకు వచ్చిన విద్యార్థులు షాక్‌కు గురయ్యారు. కంపెనీ బోర్డు తీసేసి ఆఫీసు తలుపులకు తాళాలు వేసి ఉండటంతో ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అక్కడ ఉన్న సిబ్బందిలో ఏ ఒక్కరు కనబడకపోవడం, స్వామినాయుడు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం, వాట్సాప్ గ్రూపులూ డిలీట్ కావడంతో అయోమయంలో ఉండిపోయారు. అంతే కాకుండా కార్యాలయంలో ఉన్న సిస్టమ్‌లు, డేటా కూడా మాయమైనట్టు చెపుతు న్నారు. అంతా సందేహంలో ఉన్న సమయంలో భవనం యజమాని అద్దె కూడా చెల్లించలేదు అందుకే లాక్ వేశాం అని చెప్పటంతో అసలు మోసం బయటపడింది.

కుటుంబంతో సహా స్వామినాయుడు పరార్

డబ్బులు వసూలు చేసి ఇన్ని రోజులైనా శిక్షణ గానీ, ఉద్యోగాలు గానీ ఇవ్వకపోవడంతో విద్యార్థులు సంస్థను నిలదీశారు. దీంతో అప్రమత్తమైన కంపెనీ డైరెక్టర్ స్వామినాయుడు ఆఫీస్ మూసేసి.. తన భార్య, ఇతర కీలక సభ్యులతో కలిసి పరారయ్యాడు. బాధితులు తమకు న్యాయం చేయాలంటూ బుధవారం సైబరాబాద్ సీపీని కలిసి ఫిర్యాదు చేశారు.

తమ తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన డబ్బును ఫీజుల రూపంలో కట్టామని, ఇప్పుడు డైరెక్టర్ పారిపోవడంతో తాము రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న స్వామినాయుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల బ్యాంక్ ఖాతాలు, లావాదేవీలు, రిజిస్ట్రేషన్ పత్రాలపై దర్యాప్తు ప్రారంభించారు.

గతంలో ఇదే తరహా మోసాలు

మాదాపూర్ గచ్చిబౌలి పరిసరాల్లో ఇదే తరహా మోసాలు తరచుగా బయటపడుతుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. గచ్చిబౌలి ప్యూరోపాల్ క్రియేషన్ అండ్ ఐటీ సొల్యూషన్స్ మోసం ఘటన ఈ ఏడాది మేలో జరగగా.. 200 మందికి ఉద్యోగం పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షలు తీసుకుని బోర్డు తిప్పేసింది. అప్పులు తీసుకుని, బంగారం అమ్మి, కుటుంబాల ఆశలతో కోర్సుల్లో చేరిన విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.