calender_icon.png 27 November, 2025 | 5:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలను మోసం చేసిన కాంగ్రెస్

27-11-2025 12:52:53 AM

  1. ఆ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పాలె
  2. తెలంగాణను కదిలించిన రోజు నవంబర్ 29 
  3. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
  4. హనుమకొండలో ‘దిక్షా దివస్’ సన్నాహాక సమావేశం

కాకతీయ యూనివర్సిటీ, నవంబర్ 26 (విజయక్రాంతి): రిజర్వేషన్ల విషయంలో బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ సమాజాన్ని కదిలించిన రోజు నవంబర్ 29 అని చెప్పారు. హనుమకొండలోని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అధ్యక్షతన దిక్షా దివస్ సన్నాహాక సమావేశం బుధవారం ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. తొలుత భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో తెలంగాణ సమాజాన్ని కదిలించిన రోజు నవంబర్ 29 అన్నారు. ఆరోజు కేసీఆర్‌ను ఖమ్మం జిల్లాకు తరలించిన రోజు తన మనసులో ఇంకా తిరుగుతూనే ఉందని, కేయూ దగ్గర విద్యార్థుల రాస్తారోకోలో తానూ పాల్గొన్నానని, మమ్మల్ని వరంగల్ సెంట్రల్ జైలులో పెడితే 30 గంటల తర్వాత విడుదల చేశారని గుర్తు చేశారు.

నాడు యుద్ధ భూమిని తలపించే విధంగా తెలంగాణ కదిలిందని చెప్పారు. ఈతరం పిల్లలకు దీక్షా దివస్ గురించి తెలియదని అన్నారు. ఏ దీక్షతో తెలంగాణ మలుపు తిరిగిందో ఆ దీక్షను గుర్తు చేసుకోవాలని.. కేసీఆర్ కు అండగా నిలవాలని కోరారు. కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును నిర్మించారని, ఆజామ్ జాహి మిల్లు మూతపడి బతుకుదెరువు కోసం వెళ్లిన వాళ్ళు వరంగల్‌కు రావాలని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును నిర్మించారని చెప్పారు.

కంపెనీలు రావడంతో ఇక్కడి యువతకు ఉపాధి దొరుకుతుందన్నారు. కాగా పరిపాలన చేతకాక కాంగ్రెస్ నాయకులు అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో ప్రకటించారని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు కల్పిస్తామని ఓట్లను దండుకున్నారని మండిపడ్డారు. 42 శాతం రిజర్వేషన్ల కోసం 160 కోట్లు ఖర్చుపెట్టారంటూ బీహార్‌లో రాహుల్‌గాంధీ తప్పుడు ప్రచారం చేశాడని చెప్పారు.

అంతేకాకుండా కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన 24 శాతాన్ని ప్రస్తుతం 17 శాతానికి తగ్గించారని చెప్పారు. బీసీలను మోసం చేసిన రేవంత్ సర్కార్‌ను ఏం చేయాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. కుల గణన చేసి బీసీల సంఖ్య తగ్గించారని, రిజర్వేషన్లు తగ్గించారని, తడిగుడ్డతో గొంతు కోసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలు బుద్ధి చెప్పాలన్నారు. కేసీఆర్ పోరాట స్ఫూర్తితో దీక్షా దివస్ రోజునే కదం తొక్కుతామని కేటీఆర్ స్పష్టం చేశారు.

రాహుల్ గాంధీ స్పందిస్తారా?

  1. బీసీ రిజర్వేషన్ల తగ్గింపు, ప్రజాధనం దుర్వినియోగంపై ఏమంటారో?
  2. ఎక్స్ వేదికగా కేటీఆర్  

హైదరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల తగ్గింపుపై కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ స్పందిస్తారా? అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా బుధవారం ట్వీట్ చేశారు. కులగణనలో దేశానికి తెలంగాణ ఆదర్శమంటూ రాహుల్ గాంధీ గొప్పగా చెప్పారని ఎద్దేవా చేశారు. ‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నారు..

అందుకు కాంగ్రెస్ ప్రభు త్వం రూ.160 కోట్లు ఖర్చు చేసింది. కానీ చివరికి పంచాయతీ ఎన్నికల్లో వారికి కేవలం 17 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు’ అని ఆయన పోస్టు చేశారు. బీసీలకు ఉన్న 24 శాతాన్ని 17 శాతానికి తగ్గించారని తెలిపారు. రిజర్వేషన్ల తగ్గింపు, ప్రజాధనం దుర్వినియోగంపై రాహుల్ గాంధీ స్పందిస్తారా? అని ఆయన ఎక్స్ వేదికగా నిలదీశారు.