calender_icon.png 3 August, 2025 | 4:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడలతో డ్రగ్స్‌కు కళ్లెం

03-08-2025 01:10:34 AM

-తెలంగాణ క్రీడా వికాసానికి కొత్త దిశ 

-ఒలింపిక్ పతకాలే లక్ష్యంగా నూతన స్పోర్ట్స్ పాలసీ -2025 ఆవిష్కరణ 

- రాజకీయాలకు చోటివ్వం, ప్రతిభకే పట్టం 

-ప్రైవేటు భాగస్వామ్యంతో క్రీడాకారులకు ప్రపంచస్థాయి శిక్షణ 

- త్వరలో స్పోర్ట్స్ యూనివర్సిటీ, అకాడమీల ఏర్పాటు 

-క్రీడా మైదానాలు ఇక ఫంక్షన్ హాళ్లు కావొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 2 (విజయక్రాంతి): తెలంగాణలో క్రీడారంగానికి సరికొత్త శకం ప్రారంభమైంది. రాజకీయ జోక్యాన్ని పూర్తిగా నిర్మూలించి, కేవలం క్రీడాకారుల ప్రతిభ, స్ఫూర్తిని కలిగించే లక్ష్యంతో రాష్ర్ట ప్రభుత్వం తెలంగాణ స్పో ర్ట్స్ పాలసీ-2025ను ఆవిష్కరించింది. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరిగిన తెలం గాణ స్పోర్ట్స్ కాంక్లేవ్ తొలి ఎడిషన్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నూతన క్రీడా విధానాన్ని విడుదల చేశారు.

ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సమక్షంలో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. చదువుతో పాటు క్రీడల్లోనూ యువత రాణించి, ప్రపంచ వేదికలపై తెలంగాణ ఖ్యాతిని చాటాలన్నదే తమ ప్రభుత్వ విజన్ అని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం, సరైన దిశానిర్దేశం లేకపోవడం వల్లే యువత వ్యసనాలకు బానిసలవుతున్నారని, దేశం లో నూతన విధానాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రపంచంతో పోటీపడే మనం, క్రీడల్లో వెనకబడి ఉండటం సరికాదన్నారు.

భారత్ బలమైన క్రీడా వేదిక కావాలని.. అందులో తెలంగాణ ప్రధానంగా ఉండాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ‘పోరాట స్ఫూర్తి నిండిన తెలంగాణ గడ్డపై క్రీడాకారులు వెలగాలి. మన క్రీడా మైదానాలు పెళ్లిళ్లకు ఫంక్షన్ హాళ్లుగా, సన్‌బర్న్ ఈవెంట్‌లు నిర్వహించుకునే వేదికలుగా మారాయి. ఈ దుస్థితికి స్వస్తి పలకాలి’ అని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణను క్రీడా హబ్ గా మార్చడమే లక్ష్యమని, యువత చేతికి బంతినిచ్చి ప్రోత్సహిస్తే వారు డ్రగ్స్ వైపు చూడరని ముఖ్యమంత్రి అన్నారు. ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే మన అంతిమ లక్ష్యం కావాలని రేవంత్‌రెడ్డి చెప్పారు.

రాష్ర్ట చరిత్రలో తొలిసారిగా,  రాష్ర్టంలో సరైన క్రీడా విధానం లేకపోవడం వల్లే యువత పెడదారి పడుతోందని సీఎం ఆ వేదన వ్యక్తం చేశారు. ఈ మధ్య కాలంలో తెలంగాణలో డ్రగ్స్, గంజాయి కేసులు పెరిగిపో యాయని. వీటి నియంత్రణకే ‘ఈగల్ ఫోర్స్’ ను ఏర్పాటు చేశామన్నారు. నూతన క్రీడా విధానాన్ని పబ్లిక్, -ప్రైవేట్ భాగస్వామ్యం తో అమలు చేస్తామని, ప్ర భుత్వ పాత్ర పరిమితంగానే ఉంటుందని సీఎం తెలిపారు. క్రీడలతో పాటు వివిధ రంగాల్లో విజయవం తమైన వారితో ఒక స్వతంత్ర బోర్డును ఏర్పా టు చేశామని, ఇందులో రాజకీయ జోక్యం ఉండదని ఆయన హామీ ఇచ్చారు.

రాష్ర్టం లో త్వరలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీలను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమం త్రి ప్రకటించారు. 140 కోట్ల జనాభా ఉన్న మన దేశం ఒలింపిక్స్‌లో ఒక్క స్వర్ణం కూ డా గెలవలేకపోవడం, పతకాల పట్టికలో 71వ స్థానంలో నిలవడం యావత్ జాతికి అవమానకరమని ఆయన అన్నారు. దక్షిణ కొరియాలోని ఒకే ఒక్క స్పోర్ట్స్ యూనివర్సిటీ 16 బంగారు పతకాలు సాధించిం దని, మనం ఎందుకు సాధించలేం? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ‘వచ్చే ఒలింపిక్స్‌లో గెలవకపోతే  

మన ముఖం ఎక్కడ పెట్టుకుంటాం?’ అని ఆయన అన్నారు. విజన్ డాక్యుమెంట్-2047లో క్రీడలకు ఒక ప్రత్యేక అధ్యాయం కేటాయించామని గుర్తుచేశారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించినా ప్రభుత్వం గుర్తిస్తుందనే సందేశాన్ని బలంగా పంపామని సీఎం చెప్పారు. గతంలో 1956 ఒలింపిక్స్‌లో నాలుగో స్థానం సాధించిన ఫుట్ బా ల్ జట్టులో 9 మంది హైదరాబాదీయులే ఉ న్నారని, అజారుద్దీన్, లక్ష్మణ్ నుంచి నేటి సిరాజ్, నిఖత్ జరీన్ వరకు ఎందరో క్రీడాకారులు మన గడ్డ నుంచి వచ్చారన్నారు. ‘సి రాజ్, నిఖత్‌లకు గ్రూప్-1 ఉద్యోగంతో పాటు ఇంటి స్థలం ఇచ్చాం. పారా ఒలింపిక్స్‌లో రాణించిన దీప్తికి కోటి రూపాయల నగదు, ఇంటి స్థలం అం దించాం’ అని తెలిపారు.

ఖేలో ఇండియాకు ఆతిథ్యం..

రాబోయే బడ్జెట్‌లో క్రీడలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని, 2026లో జరగనున్న ఖేలో ఇండియా క్రీడలకు తెలంగాణ ఆతిథ్యం ఇచ్చేలా అవకాశం కల్పించాలని కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయాను కోరినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి తదితరులు హాజరయ్యారు.

పాలసీ ప్రధానాంశాలు.. 

-పబ్లిక్, -ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్(పీపీపీ) పద్ధతిలో నూతన క్రీడా విధానం అమలు 

-కార్పొరేట్ రంగంలో విజయవంతమైన వారు, క్రీడల్లో పతకాలు సాధించిన వారు, క్రీడా విశ్వవిద్యాలయాలను నడిపిన అనుభవజ్ఞులతో అటానమస్ బోర్డు ఏర్పాటు 

-రాజకీయ జోక్య రహితంగా అటానమస్ బోర్డు నిర్వహణ 

-క్రీడల కోసం ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం, అకాడమీల ఏర్పాటు 

-పలు అంతర్జాతీయ క్రీడా సంస్థలతో రాష్ర్ట ప్రభుత్వం ఒప్పందాలు