సినీ నిర్మాత, రాజకీయ నాయకుడు గొట్టిముక్కల పద్మారావు కన్నుమూత
కూకట్‌పల్లి, జూన్ 21 (విజయక్రాంతి): సినీ నిర్మాత, తెలంగాణ ఉద్యమ నేత గొట్టిముక్కల పద్మారావు(72) ఆదివారం ఉదయము నాలుగు గంటలకు కూకట్పల్లి వివేకానంద నగర్ లోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. గొట్టిముక్కల పద్మారావు గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు.
తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో గుండెపోటు రావడంతో ఇంట్లోనే తుది శ్వాస విడిచారు. పద్మారావు సినీ రంగంలో, రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు. అభిరుచి గల నిర్మాతగా ప్రేక్షకులను నవ్వించే సినిమాలను తీసి తన కళాత్మకతను చాటుకున్నారు.
1996 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించారు. కూకట్పల్లి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఆహ్వానం మేరకు 2010 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి ప్రత్యేక రాష్ట్ర సాధనకై పోరాడారు. తెలంగాణ రాష్ట్ర సమితి కూకట్పల్లి నియోజకవర్గ ఇన్చార్జిగా పార్టీ బలోపేతానికి కృషి చేశారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు.






