calender_icon.png 24 December, 2025 | 2:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్-1బీ వీసాలపై చివరి సమీక్ష

24-12-2025 12:00:00 AM

  1. ఇకపై వెయిటెడ్ సెలక్షన్ సిస్టమ్ ద్వారా జారీ
  2. ఇక ఎక్కువ జీతం ఉద్యోగులకే హెచ్-1బీ దక్కే చాన్స్

వాషింగ్టన్, డిసెంబర్23: విదేశీ ఉద్యోగులకు ఇచ్చే హెచ్-1బీ వీసా ఎంపిక ప్రక్రియలో కీలక మార్పులకు అమెరికా సిద్ధమైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఇప్పటికే ప్రతిపాదనలు రూపొందించగా.. వాటిపై తుది సమీక్ష మొదలైంది. నైపుణ్యం, వేతనాల ఆధారిత లాటరీ వ్యవస్థ కోసం రూపొందించిన నిబంధనలను ‘ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్’ సమీక్షిస్తోంది.

ఈ మేరకు ఇమిగ్రేషన్ సంస్థ ప్రాగోమెన్ నివేదికను ఉటంకిస్తూ మీడియాలో కథనాలు వచ్చాయి. ఫెడరల్ నిబంధనల మార్పుల ప్రక్రియలో ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ సమీక్షను చివరిదశగా పరిగణిస్తారు. ఇక్కడ ఆమోదం పొందిన తర్వాత నిబంధనలు ఖరారు చేసి, వాటిని ప్రకటిస్తారు. వీలైనంత త్వరగా ఈ రివ్యూను పూర్తిచేసి, తుది నిబంధనలకు సంబంధించిన అడ్వాన్స్ కాపీని త్వరలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం.

నిపుణులైన కార్మికులు మాత్రమే దేశంలోకి వచ్చేలా, అమెరికన్లకు ప్రాధాన్యం కల్పించేలా అగ్రరాజ్యం ఈ కొత్త మార్పులు తీసుకురానుం ది. ప్రస్తుతం హెచ్-1బీ వీసాల జారీకి కంప్యూటరైజ్డ్ లాటరీ విధానాన్ని అనుసరిస్తుండగా ఇకపై వెయిటెడ్ సెలక్షన్ సిస్టమ్‌ను ప్రవేశ పెట్టనున్నారు. దీని ప్రకారం.. ఉద్యోగి వేతన స్థాయిని అనుసరించి రిజిస్ట్రేషన్‌లో ప్రాధాన్యం కల్పించడం, వేతన వర్గీకరణ ఆధారంగా దరఖాస్తులను విభజించడం వంటివి చేయనున్నారు. అంటే ఇకపై అధిక వేతనం కలిగిన ఉద్యోగులకు హెచ్ వీసాలు ఎక్కువగా దక్కే అవకాశం ఉంది. 

వారికి గూగుల్ శుభవార్త

తాత్కాలిక వీసాలపై అమెరికాలో పనిచేస్తూ శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న విదేశీ ఉద్యోయగులకు టెక్‌దిగ్గజం గూగుల్ తీపికబురు చెప్పింది. హెచ్-1బీ వీసా ఉద్యోగులకు ఉపశమనం కల్పిస్తూ 2026లో గ్రీన్ కార్డ్ స్పాన్సర్షిప్‌ను పెంచే ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు గూగుల్ పేర్కొంది. ఇంటర్నల్ న్యూస్ లెటర్‌లో ఉద్యోగులకు దీనిపై సమాచారం ఇచ్చినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

వచ్చే ఏడాది(2026) పెర్మ్(పీఈఆర్‌ఎం) దరఖాస్తులను ‘పెంచడం’ ప్రారంభిస్తుందని గూగుల్ తెలిపింది. పెర్మ్ లేదా ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్ రివ్యూ మేనేజ్మెంట్, యూఎస్ ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ ప్రక్రియలో కీలకమైన దశ. అంతేకాకుండా ఉద్యోగులు తాత్కాలిక వర్క్ వీసాల నుంచి శాశ్వత నివాసానికి మారడానికి సహాయపడటానికి టెక్ కంపెనీలు దీనిని విస్తృతంగా ఉపయోగిస్తుంటాయి.

పెర్మ్‌కి అర్హత సాధించిన ఉద్యోగులు 2026 మొదటి త్రైమాసికంలో గూగుల్ ఇమ్మిగ్రేషన్ సంస్థల నుంచి పిలుపు వినవచ్చని పేర్కొంది. ఈ విషయాన్ని గూగుల్ బహిరంగంగా ప్రకటించనప్పటికీ, అంతర్గత కమ్యూనికేషన్ కాపీని బిజినెస్ ఇన్‌సైడర్ సమీక్షించింది. ఈ విషయంలో స్పందించడానికి గూగుల్ ప్రతినిధి నిరాకరించారు. అయితే పెర్మ్ అర్హత సాధించాలంటే అనేక అంతర్గత షరతులను విధించినట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.