24-12-2025 12:00:00 AM
న్యూఢిల్లీ, డిసెంబర్ ౨౩: దేశ రాజధాని న్యూఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం వద్ద మంగళవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. బంగ్లాదేశ్‌లో వరుసగా హిందువులపై జరుగుతున్న దాడులతోపాటు దీపూ చంద్రదాస్ అనే హిందువు దారుణ హత్యను ఖండిస్తూ విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ), బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వేలాది మంది కార్యకర్తలు, ఆధ్యాత్మిక సంఘాల సభ్యులు హైకమిషన్ వద్దకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
హిందువులపై దాడులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. హిందువుల ప్రతి రక్తపు బొట్టుకు లెక్క చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌ను భారత్ సోదరభావంతో చూస్తూ వస్తున్నదని గుర్తుచేశారు. దీపూ హత్య కారణమైన వారికి కఠినమైన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు. అందుకు భారత ప్రభుత్వం తక్షణం దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
కాషాయ జెండాలు, ఫ్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ ఎంబసీ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఒక దశలో బారికేడ్లు నెట్టుకొని బంగ్లా హైకమిషన్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ క్రమంలో నిరసనకారులకు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పోలీసులు అప్రమత్తమై ఆందోళనకారులను హైకమిషన్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఉద్రిక్త ఘటనలను ముందుగానే అంచనా వేసిన ఢిల్లీ పోలీసులు 1,500 మంది పారామిలటరీ జవాన్లను ఆ ప్రాంతంలో మోహరింపజేశారు. పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని వాహనాల్లో పోలీస్‌స్టేషన్లకు తరలించారు. తద్వారా పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకొచ్చారు.
‘బంగ్లా’ నోటీసులు
ఢిల్లీలోని బంగ్లా హైకమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తలపై అక్కడి తాత్కాలిక ప్రభుత్వం స్పందించింది. ఈమేరకు భారత హైకమిషనర్‌కు సమన్లు జారీ చేసింది. ఢిల్లీలోని తమ కార్యాలయం వద్ద జరిగిన నిరసనలపై ఆందోళన వ్యక్తం చేంది. దౌత్య కార్యాలయాల భద్రత పెంచాలని కోరింది. దీనిపై భారత ప్రభుత్వం స్పందిస్తూ.. ఢిల్లీలో ఆందోళనకారుల నిరసనలు ప్రశాంతంగానే జరిగాయని, భద్రతాపరంగా ఎలాంటి ముప్పు వాటిల్లలేదని స్పష్టం చేసింది.
అంతర్జాతీయ సమాజం ఖండన
బంగ్లాదేశ్‌లో అల్లరిమూకలు ఇటీవల దీపూ అనే హిందువు హతమార్చిన ఘటనపై అంతర్జాతీయ సమాజం స్పందిస్తున్నది.దీనిలో భాగంగానే యూఎస్ ప్రభుత్వం తాజాగా మైనార్టీలను రక్షించేందుకు బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. మూక దాడులు, హత్య ఘటన తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని అమెరికన్ సెనేటర్ రాజాకృష్ణమూర్తి ఆందోళన వ్యక్తంచేశారు.
మూకదాడి ఘటన కలచివేసిందని న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ సభ్యురాలు జెన్నిఫర్ రాజ్కుమార్ పేర్కొన్నారు. దాడులను నివారించడంలో బంగ్లా తాత్కాలిక యూనస్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. దేశంలో హింసాత్మక ఘటనలకు తాత్కాలిక ప్రభుత్వ వైఫల్యమే కారణమని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (ఎన్‌సీపీ) నేత ఆమిర్ ఖస్రు మహమ్మద్ విమర్శించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆయన ఆరోపించారు.
మరో దాడి
బంగ్లాదేశ్‌లో హిందువు మైనార్టీలపై దాడులు ఆగడం లేదు. అల్లరి మూకలు సోమవారం అర్ధరాత్రి చట్టోగ్రామ్‌కు చెందిన జయంత్ సంగా, బాబు సుకిశిల్ అనే హిందూ కుటుంబాలపై అకారణంగా దాడులు చేశా యి. బాధిత కుటుంబ సభ్యులు ఎంతో ప్రయాసలకోర్చి అక్కడి నుంచి తప్పించుకుని ప్రాణాలను దక్కించుకున్నారు. దీంతో ఆగ్రహించిన అల్లరిమూ కలు ఆ కుటుంబాలు నివాసం ఉంటున్న ఇళ్లను ధ్వంసం చేశాయి. అనంతరం ఆ కుటుంబ సభ్యులను హెచ్చరిస్తూ ఒక నోట్ రాసి ఇంట్లో వదిలివెళ్లాయి. ఈ ఏడాది ప్రారంభంనుం చి ఇప్పటివరకు బంగ్లాదేశ్‌లో 258 మంది హిందువులపై దాడులు చోటుచేసుకోవడం గమనార్మం. దాడుల్లో 27మంది ప్రాణాలు కోల్పోవడం విషాదం.
దేశవ్యాప్తంగా నిరసనలు
బెంగాల్ రాజధాని కోల్‌కతా, మధ్యప్రదేశ్ రాజధాని భూపాల్‌లోనూ బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై నిరసనలు వెల్లువెత్తాయి. ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి బంగ్లా తాత్కాలిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు భద్రతా కారణాల దృష్ట్యా బంగ్లాదేశ్ హైకమిషన్ వీసా సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది.