24-12-2025 12:00:00 AM
భువనేశ్వర్, డిసెంబర్ ౨౩: ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లాలో మంగళవారం 22 మంది మావోయిస్టు పార్టీ దళ సభ్యులు ఆ రాష్ట్ర డీజీపీ వైవీ ఖురానియా సమక్షంలో లొంగిపోయారు. వీరిలో 10 మంది మహిళలు ఉన్నారు. లొంగిపోయిన వారిలో ఒక డివిజనల్ కమిటీ సభ్యురాలు (డీసీఎం), ఆరుగురు ఏరియా కమిటీ సభ్యులు (ఏసీఎంలు) కీలక నేతలు కూడా ఉన్నారు. వీరందరిపై కలిపి మొత్తం రూ.2.18 కోట్ల మేర రివార్డు ఉన్నట్లు డీజీపీ ప్రకటించారు.
మావోయిస్టులు ఈ క్రమంలోనే తమ వద్ద ఉన్న భారీ ఆయుధ సామగ్రిని పోలీసులకు అప్పగించారు. వాటిలో ఒక ఏకే-47 రైఫిల్, రెండు ఇన్సాస్ రైఫిల్స్, ఒక ఎస్‌ఎల్‌ఆర్, ఐదు 303 రైఫిళ్లు, 150 రౌండ్ల తూటాలు, 13 టిఫిన్ బాంబులు, 20 కిలోల పేలుడు పదార్థాలు ఉన్నాయి. లొంగిపోయిన వారిలో ఎక్కువ మంది ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన వారే అయినప్పటికీ, వీరంతా ఒడిశా సరిహద్దుల్లోని దండకారణ్యం, ఏవోబీ (ఆంధ్రా-ఒడిశా బోర్డర్) ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశాన్ని నక్సల్ రహితంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో, పోలీసులు ’ఆపరేషన్ కగార్’ వంటి గాలింపు చర్యలను ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. భద్రతా బలగాల నుంచి మావోయిస్టులపై ఒత్తిడి పెరగడం, పార్టీ సిద్ధాంతాలపై నమ్మకం తగ్గడం, అలాగే ఒడిశా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పునరావాస పథకాలకు పట్ల ఆకర్షితులై పోలీసుల ఎదుట మావోయిస్టులు లొంగిపోయారు. తాజా పరిణామంతో ఏవోబీ ప్రాంతంలో మావోయిస్టుల బలం మరింత క్షీణించిందని డీజీపీ పేర్కొన్నారు.