30-04-2025 11:59:22 PM
కాలిపోయిన పలు షాపులు..
13 ఫైరింజన్లతో మంటలు అదుపు చేసిన అగ్నిమాపక దళం..
న్యూఢిల్లీ: ప్రముఖ ఢిల్లీ హాట్ మార్కెట్ వద్ద బుధవారం ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో అనేక షాపులు కాలిపోయాయి. సమాచారం తెలుసుకుని హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 13 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. కాలిపోయిన షాపులలో ఎక్కువ భాగం దుస్తులు, ఆభరణాలు, యాంటిక్ పీస్‌లకు చెందినవి. కశ్మీర్ నుంచి వలసవచ్చిన అనేకమంది ఈ షాపులను ఏర్పాటు చేసుకున్నారు. ఢిల్లీ హాట్ అనేది హస్తకళల వస్తువులకు ప్రసిద్ధి. ఈ వార్త తెలిసిన వెంటనే ఢిల్లీ సంస్కృతి, భాషా మంత్రి కపిల్ మిశ్రా సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ‘ఢిల్లీ హాట్‌లో జరిగిన అగ్నిప్రమాదం అదుపులోకి వచ్చింది. ఈ ప్రమాదంలో ఎవరూ మృతి చెందలేదు. అగ్నిమాపక బృందాలు, స్థానిక యంత్రాంగం ప్రస్తుతం సంఘటనా స్థలం వద్దే ఉంది. నేను అక్కడికి వెళ్తున్నాను’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.