calender_icon.png 27 November, 2025 | 9:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే వీరేశం తీరుపై సుంకరబోయిన ఫైర్

27-11-2025 08:06:33 PM

నకిరేకల్ (విజయక్రాంతి): స్థానిక గ్రామపంచాయతీ ఎన్నికలలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాత వర్గాన్ని విస్మరించి కొత్త వర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి తన ఇష్టారాజ్యంగావ్యవహరిస్తున్నాడని కట్టంగూరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ జెడ్పిటిసి సుంకరబోయిన నర్సింహ్మ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో ఆయన గురువారం మండల కేంద్రంలోని వైవిఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కొరకు ఏళ్ల తరబడి పార్టీలు మారకుండా క్రమశిక్షణగా పనిచేస్తున్న వారిని పక్కకు పెట్టి తన ఇష్టం వచ్చిన వారికి పంచాయతీ ఎన్నికల్లో టికెట్లు ఇస్తున్నారని విమర్శించారు. ఒక వ్యక్తి చేతిలో మండల పార్టీని పెట్టి నియంతల వ్యవహరిస్తున్నాడని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ కొరకు పని చేసిన కార్యకర్తలను అవమానాలకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామ, మండల, నియోజకవర్గ నాయకుల అభిప్రాయ సేకరణ లేకుండా, పాత కాంగ్రెస్ నాయకులను పక్కకు పెట్టి 22 గ్రామ పంచాయతీలకు తన సొంత సర్పంచ్ అభ్యర్థులను ప్రకటించుకున్నాడని చెప్పారు. టికెట్ల కేటాయింపులో ఎమ్మెల్యే వేముల వీరేశం, అతడి వర్గీయుల నుంచి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. పార్టీలు మారకుండా 40 సంత్సరాలు కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని పని చేస్తున్న వారిని పట్టించుకోలేదన్నారు. ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు అందరినీ కలుపుకొని పోతానని చెప్పి ఎమ్మెల్యే అయ్యాక తమని దూరం పెట్టారన్నారు. ఇత‌ర పార్టీల నుండి కాంగ్రెస్‌లోకి వ‌చ్చిన వారు కట్టంగూర్‌పై పెత్తనం చేయడం ఎంటని ఆయ‌న‌ ప్రశ్నించారు.

పాత కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అద్దెకు వచ్చిన నాయకులను నమ్మవద్దని మండలంలోని 22 గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులకు కాంగ్రెస్ పార్టీ తరుపున నామినేషన్లు వేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రెండు సంవత్సరాలు కాళ్లు, చేతులు కట్టేసినట్లు అయినా ఓపికపట్టి వాళ్ల వెంట తిరిగినా ఫ‌లితం లేదని,ఇక వాళ్లకు త‌న‌కు సంబంధం లేదన్నారు. పాత కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులను ముందుండి గెలిపించేందుకు కృషి చేస్తానన్నారు.  కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చెరుకు యాదగిరి, నాయకులు ముక్కాముల శేఖర్, మేడి ఇద్దయ్య, గట్టిగొర్ల సత్తయ్య, మేడి విజయ్, మేడిశ్వరమ్మ, చెరుకు రామన్న, కాపుగంటి గోపి, ఊటుకూరు శ్రీను ఉన్నారు.