27-11-2025 08:04:57 PM
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత...
బాన్సువాడ (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. జనం బాటలో భాగంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొయ్యగుట్ట అమరవీరుల స్థూపం వద్ద ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో నివాళులర్పించారు.అనంతరం కొయ్యగుట్ట సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల సందర్శించి విద్యార్థినులతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తానని చెప్పి మోసం చేసిందని, ఉద్యమకారులకు పింఛన్, గుర్తింపు కార్డులు ఇచ్చేవరకు పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమకారులకు ఇంటి స్థలాలు ఇవ్వకపోతే మరో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం హాస్టల్ విద్యార్థులకు పెండింగ్ కాస్మొటిక్ ఛార్జీలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల చందూర్ మైనార్టీ గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థి మృతిపై ప్రభుత్వం పారదర్శకంగా విచారణ చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు.