22-01-2026 12:33:56 AM
అమాయక యువతకు గాలం... ఆపై మోసం..
పెరుగుతున్న డిజిటల్ నేరాలు..
నియంత్రణ చేపట్టాలని ప్రజల డిమాండ్..
బాన్సువాడ, జనవరి 21 (విజయ క్రాంతి): ఈ మధ్యకాలంలో కంప్యూటర్ యుగం పరుగు పెడుతున్న విధంగా యువతి యువకులు ఆకర్షణ వేగం కూడా పెరుగుతుంది. అబ్బాయి, అమ్మాయి కాసింత చనువుగా మాట్లాడితే చాలు అదే ప్రేమగా భావించి ఇద్దరు కలిసి పోయే ఆలోచనలకు దిగుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ట్రెండ్ ఇదే. ఎన్నో లక్ష్యాల తోటి తల్లిదండ్రులు ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ లాంటి ఉన్నత చదువుల కోసం ఉన్నత పట్టణాలకు పంపిస్తే అక్కడి వాతావరణం అబ్బాయి అమ్మాయిలను కలుషితం చేస్తున్నాయి.
ఆకర్షిణే ప్రధానంగా భావించి ప్రేమ పేరిట యువత తమ భవిష్యత్తును బుగ్గి పాలు చేసుకుంటున్నారు.ప్రేమ, అనురాగం మానవ సహజ భావాలు.. అయితే అదే ప్రేమను ఆయుధంగా మార్చుకుని వల వేసే మోసగాళ్లు ఇప్పుడు సమాజాన్ని పట్టిపీడిస్తున్నారు. సోషల్ మీడియా, డేటింగ్ యాప్లు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ లాంటి వేదికలే వీరి వేట మైదానాలుగా మారాయి. నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను, నువ్వే నా జీవితం అనే తీయని మాటల వెనుక భయంకరమైన మోసపు పూరిత కుట్ర దాగి ఉంటుంది.
వలపు వల ఎలా వేస్తారంటే..?
సాధారణంగా అందమైన ప్రొఫైల్ ఫోటో, నకిలీ పేరు, విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నానని చెప్పే కథతో పరిచయం మొదలవుతుంది. రోజూ చాటింగ్, వీడియో కాల్స్, ప్రేమ మాటలతో బాధితుడి నమ్మకాన్ని సంపాదిస్తారు. ఆ తర్వాతే అసలు ఆట మొదలవుతుంది. డబ్బు, నగ్న వీడియోలు, బ్లాక్మైలింగ్.
ప్రేమ పేరుతో ఆర్థిక దోపిడీ...
హైదరాబాద్కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఫేస్బుక్లో పరిచయమైన యువకుడితో ప్రేమలో పడింది. అతను యూరప్లో బిజినెస్ చేస్తున్నాను అని చెప్పాడు. కొన్ని నెలల తర్వాత బిజినెస్లో సమస్య వచ్చింది, కొంచెం డబ్బు పంపు అని కోరాడు. ప్రేమ మీద నమ్మకంతో ఆమె దశలవారీగా రూ. 18 లక్షలు పంపింది. ఆ తర్వాత అతని ఫోన్ స్విచ్ ఆఫ్. ప్రొఫైల్ డిలీట్. అప్పటికే ఆలస్యం. పోలీసులను ఆశ్రయించగా అది అంతర్జాతీయ సైబర్ మోసం అని తేలింది.
వీడియో కాల్ నుంచి బ్లాక్‌మెయిలింగ్ వరకు
ఓ యువకుడికి ఇన్స్టాగ్రామ్లో ఓ యువతి పరిచయమైంది. కొద్ది రోజుల్లోనే వీడియో కాల్కు ఒప్పించింది. ఆ కాల్ను రికార్డు చేసి, ఆ వీడియోను కుటుంబసభ్యులకు పంపుతానంటూ బెదిరింపులకు దిగింది. లక్షల రూపాయలు డిమాండ్ చేసింది. భయంతో కొంత మొత్తం పంపినా బెదిరింపులు ఆగలేదు. చివరకు సైబర్ పోలీసులను ఆశ్రయించడంతో నకిలీ ఖాతా వెనుక ఉన్న గ్యాంగ్ గుట్టు బయటపడింది.
పెరుగుతున్న మోసాలు?
సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరగడం, ఒంటరితనం, భావోద్వేగ బలహీన తత్వంగా ఉండటం.. లైంగిక వాంఛలు తీర్చుకోవడంలో సిగ్గు, భయంతో ఫిర్యాదు చేయకపోవడం యువత పెడదారి పట్టాల్సిన పరిస్థితి పడుతుంది. ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తిని వెంటనే నమ్మిస్తున్నారు. వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు ఎప్పటికీ షేర్ చేస్తున్నారు.డబ్బు, బ్యాంక్ వివరాలు ఇవ్వొద్దు..
అని బ్యాంక్ ఆధర్ నెత్తినోరు కొట్టుకున్న వినడం లేదు. అనుమానం వస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెబుతున్న పట్టించుకోవడం లేదు పరిస్థితి ఎదురైంది. 1930 సైబర్ హెల్ప్లైన్ను సంప్రదించాలని నిబంధన పట్టించుకోని పరిస్థితి దాపరించలేక పోయింది.
అయితే ఎలా..?
వలపు వల మోసాలు ప్రేమకథలుగా మొదలై జీవితాల్ని నాశనం చేసే నేరాలుగా మారుతున్నాయి. ప్రేమ అందమైనది, కానీ అప్రమత్తత లేకపోతే అదే ప్రాణాంతకం. ఆన్లైన్ ప్రేమలో పడే ముందు ఒక్క క్షణం ఆలోచించడమే మీ భవిష్యత్తును కాపాడుతుంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రేమ వివాహాలు చాలా మటుకు కలకాలం నిలబడలేకపోతున్నాయి.
ఆకర్షణతో దగ్గరైన జంటలు పెళ్లి పేరిట మూడు ముళ్ళు వేసుకొని త్వరలోనే విడిపోతున్నాయి. ఇది ప్రస్తుతం జరుగుతున్న తీరు. ప్రస్తుతం యువతి,యువకులు తల్లిదండ్రుల మాటలు వినకుండా లవ్ ఎఫైర్ పేరిట తమ భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకుని ప్రయత్నం చేస్తున్నారు. ఆకర్షణ అనేది కాసింత ఉపోషణమే కానీ శాశ్వతం కాదన్న విషయాన్ని యువత గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డిజిటల్ మోసాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.