22-01-2026 12:33:50 AM
ములకలపల్లి, డిసెంబర్ 21 (విజయక్రాంతి): విద్యుదాఘాతానికి గురై బుధవారం మండలంలోని కొత్త గంగారం గ్రామంలో ఓ పూరిళ్ళు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో సుమారు రెండు లక్షల రూపాయల మేరకు ఆస్తి నష్టం జరిగింది. కొత్త గంగారం గ్రామానికి చెందిన సుంకిపాక శివ కుమార్, ఆరుద్ర దంపతుల తాటాకుల ఇంట్లో కరెంటు షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు చెలరేగి ఇల్లు మొత్తం ఖాళీ బుగ్గి అయ్యింది. ఇంట్లోని గృహో పకరణాలు, నిత్యవసరాలు, దుస్తులు కాలి బూడిద అయ్యాయి.
ఈ దంపతులకు సెంట్ భూమిలేదు. ప్రతి రోజు కూలీ పని చేస్తూ జీవనం గడుపుతున్నారు. ఇంట్లో ఉన్న బియ్యం, బట్టలు, వంట సామాగ్రి, పిల్లల పుస్తకాలు, సర్టిఫికెట్లు, మంచాలు, వంట గిన్నెలు మొత్తం కాలిపోయాయి. కట్టుబట్టలతో మిగిలారు. ఈ అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబంతో పాటు గ్రామస్తులు కోరారు.