22-12-2025 12:00:00 AM
స్వామి నామస్మరణతో మారుమోగిన రామాయంపేట
రామాయంపేట, డిసెంబర్ 21: రామయంపేట పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రథమ పుష్కర బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పల్లె జితేందర్ గౌడ్ గురు స్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ బ్రహ్మోత్సవాలు భక్తుల శ్రద్ధాభక్తులతో ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు ప్రభాత పూజ, నవగ్రహ హోమం, సుదర్శన హోమం, సామూహిక కుంకుమార్చన, మూలమంత్ర హోమం, నవ కలశాభిషేకం, పడి మంగళ హారతి, అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు భక్తుల మధ్య భక్తి పారవశ్యంతో నిర్వహించారు.
అదేవిధంగా ధ్వజ ప్రతిష్ట, ధ్వజారోహణం, ఉత్తర పూజ, పుష్పాభిషేకం, హరివరాసనం వంటి పూజా కార్యక్రమాలు ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక వాతావరణంతో నింపాయి. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్, గురు స్వామి పల్లె జితేందర్ గౌడ్ మాట్లాడుతూ నేటి నుండి మూడు రోజుల పాటు శ్రీ అయ్యప్ప స్వామి పుష్కర బ్రహ్మోత్సవాలను భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా సుదర్శన హోమం, మృత్యుంజయ హోమం, సింగారి మేళంతో స్వామివారి ఊరేగింపు, సహస్ర కలశాభిషేకం, స్వర్ణాభిషేకం, అరట్టు చక్రస్నానం ఊరేగింపు వంటి విశేష కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు.