calender_icon.png 6 September, 2025 | 5:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణికి ఫైవ్ స్టార్ రేటింగ్

06-09-2025 12:00:00 AM

  1. శ్రీరాంపూర్ ఏరియాలోని 2 గనులు 
  2. ఆర్జీ-3, ఇల్లందు ఏరియాల నుంచి ఒక్కొ గనికి..
  3. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి నుంచి అవార్డు అందుకున్న సీఎండీ

మంచిర్యాల, సెప్టెంబర్ 5: సింగరేణి సం స్థ 2024 ఆర్థిక సంవత్సరానికి జాతీయ స్థాయిలో నాలుగు ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డులు అందుకుంది. పర్యావరణ హిత చర్య లు, సంక్షేమం, సౌకర్యాల కల్పనలో ఉత్తమ కంపెనీగా ఉన్న సింగరేణి సంస్థలోని నాలు గు గనులు ఫైవ్ స్టార్ రేటింగ్ ను సాధించి తన ప్రతిభను మరోసారి చాటుకొని గురు వారం ముంబయిలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చేతుల మీదుగా సింగరేణి సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) ఎన్.బలరామ్ ఈ అవార్డులను అందుకున్నారు. 

స్టార్ రేటింగ్ ఆధారంగా అవార్డులు

కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రతీ ఏడాది దేశంలో అత్యుత్తమ గనులకు స్టార్ రేటింగ్ ను ఇస్తూ అత్యుత్తమ స్టార్ రేటు సాధించిన గనుల యాజమాన్యాలను అభినందిస్తూ అవార్డులను అందిస్తుంది. ఇలా స్టార్ రేటింగ్ ఇవ్వడం కోసం బొగ్గు గని పనితీరు, రక్షణ చర్యలు, నిర్వహణ, అక్కడ గల సౌకర్యాలు, పర్యావరణహిత చర్యలు, కార్మిక సంక్షేమం వంటి 84 అంశాలను పరిగణనలోకి తీసుకుని మార్కులను కేటాయిస్తుంది.

జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రమాణాలు కలిగిన అంశాలను ప్రత్యక్షంగా కేంద్ర బొగ్గు శాఖ నుంచి వచ్చిన పరీశీలక బృందం పరిశీలించి మూల్యాంకనం జరుపుతారు. ప్రాథమిక మూల్యాంకనం తర్వాతనే అత్యుత్తమ గనులను ఎంపిక చేస్తారు. వీటిలో ఇంకా అత్యుత్తమమైన వాటిని మరో కమిటీ ద్వారా ఎంపిక చేస్తారు. 100 మార్కుల్లో 91 కన్నా ఎక్కువ మార్కులు సాధించిన గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తారు. 

శ్రీరాంపూర్ ఏరియా నుంచే రెండు గనులు

రాష్ర్టంలోని మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని రామగుండం -1 ఏరియాతో పాటు రామగుండం -2, రామగుండం - 3, బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్, భూపాలపల్లి, మణుగూరు, ఇల్లందు, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల్లో సింగరేణి కాలరీస్ కంపనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) విస్తరించి ఉంది.

ప్రతిష్టాత్మక ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డులను అందుకున్న గనులలో మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ ఏరియాకి చెందిన ఆర్కే-6, ఆర్కే న్యూటెక్  భూగర్భ గనులు ఉండగా పెద్దపల్లి జిల్లాలోని రామగుండం-3 ఏరియాకి చెందిన ఆర్జి ఓసి-1 ఎక్స్ టెన్షన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు ఏరియాకి చెందిన జేకే-5 ఓపెన్ కాస్టు గనులు ఉన్నాయి.

గనుల నిర్వహణ, పర్యావరణ చర్యలు, సంక్షేమ కార్యక్రమాలు, ఉత్పత్తి సాంకేతికత వంటి అంశాలలో ఉత్తమ ప్రమాణాలు పాటిస్తున్నందువల్లనే సింగరేణి సంస్థలో ఈసారి నాలుగు గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించాయి.

బాధ్యత మరింత పెరిగింది 

గనుల నిర్వహణ, పర్యావరణ చర్యలు, సంక్షేమ కార్యక్రమాలు, ఉత్పత్తి సాంకేతికత వంటి అంశాలలో జాతీయ స్థాయిలో శ్రీరాంపూర్ ఏరియా పరిధిలోని ఆర్కే- 6, ఆర్కే న్యూటెక్ భూగర్భ గనులు ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించడం హర్షనీయం. స్టార్ రేటింగ్ సాధించడంతో బాధ్యత మరింత పెరిగింది. ఇందుకు కారణమైన అధికారులకు, కార్మికులకు శుభాకాంక్షలు. మున్ముందు ఏరియాలోని అధిక గనులు ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించేందుకు కృషి చేస్తా.

  మునిగంటి శ్రీనివాస్, జనరల్ మేనేజర్, శ్రీరాంపూర్ ఏరియా

4 ఫైవ్ స్టార్ అవార్డులు రావడం అభినందనీయం 

సింగరేణి సంస్థలోని భూగర్భ, ఓపెన్ కాస్టు గనులలో జాతీయ స్థాయిలో నాలుగు గనులకు ఫైవ్ స్టార్ అవార్డు రావడం అభినందనీయం. గతంలో ఎప్పుడూ లేని విధంగా నాలుగు గనులకు 5 స్టార్ రేటింగ్, 14  గనులు 4 స్టార్ రేటింగ్ (100 కు 80 నుండి 90 మార్కులు), 20 గనులకు 3 స్టార్ రేటింగ్ లభించాయి.

గతంలో కొన్ని గనులకు 2 స్టార్ రేటింగ్ కూడా లభించగా ఈ సారి అన్ని గనులు కూడా తమ పనితీరును మెరుగుపర్చుకొని 3 స్టార్ రేటింగ్ పైనే సాధించాయి. ఇది యాజమాన్యం, కార్మికుల కృషితోనే సాధ్యమైంది. మున్ముందు చక్కని పనితీరుతో మరిన్ని అవార్డులు సాధించాలి. 

 బలరాం నాయక్, సీఎండీ, సింగరేణి