12-12-2025 08:12:36 PM
ఎస్పీ డాక్టర్ వినీత్
ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి
నారాయణపేట,(విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా, ప్రజల్లో భద్రతా భావాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే లక్ష్యంతో నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాజాపూర్ గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. ఈ ఫ్లాగ్ మార్చ్ లో, పోలీసు అధికారులు, లోకల్ పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా, శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, నిర్భయంగా ఓటేద్దాం ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం,
ఓటు మన హక్కు,అనే నినాదాలతో ఈ ప్లగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ ఫ్లాగ్ మార్చ్ ప్రధాన ఉద్దేశం ప్రజలలో ధైర్యాన్ని నింపి, చట్టాన్ని ఉల్లంఘించాలని చూసే అసాంఘిక శక్తులకు, రౌడీషీటర్లకు బలమైన హెచ్చరిక పంపడమేనని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా సున్నితమైన మరియు అతి-సున్నితమైన గ్రామాలలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ప్రజలకు కీలక సూచనలు చేస్తూ, ముఖ్యంగా క్రిటికల్ గ్రామాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా, ఇతరులను భయపెట్టేందుకు ప్రయత్నించినా, లేదా అనుమానాస్పద వ్యక్తులు సంచరించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. గ్రామాలలో శాంతిభద్రతలను కాపాడడంలో కేవలం పోలీసుల పాత్రే కాక, ప్రజల సహకారం కూడా ఎంతో ముఖ్యమని ఎస్పీ అన్నారు. పోలీస్ యంత్రాంగం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి, అండగా ఉంటుందని, ప్రజలు నిర్భయంగా ఓటు వేయడానికి అవసరమైన అన్ని రక్షణ చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐ శివశంకర్, ఎస్ఐ లు రాముడు, వెంకటేశ్వర్లు, నరేష్, రాజు, శివ శంకర్ పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.