12-12-2025 08:40:18 PM
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): కాకతీయ విశ్వవిద్యాలయ గెస్ట్ హౌస్‌లో రిటైర్డ్ ప్రొఫెసర్ల సంఘం కుర్తా, రిటైర్డ్ నాన్-టిచింగ్ ఉద్యోగుల సంఘం ఆహ్వానం మేరకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1000 కోట్ల రూపాయలు మంజూరు చేసిన నిర్ణయాన్ని సమావేశంలో ప్రశంసించారు.
అదే విధంగా కాకతీయ విశ్వవిద్యాలయానికీ సమాన ప్రాధాన్యత ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర తెలంగాణ విద్యార్థుల ఉన్నత విద్య అవకాశాలను బలోపేతం చేయాలని విశ్రాంత ఆచార్యులు, ఎన్జీవో సంఘ ప్రతినిధులు కోరారు. గత రెండు దశాబ్దాలుగా రాష్ట్ర విశ్వవిద్యాలయాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని వారు స్పష్టం చేశారు. యూనివర్సిటీ పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి చూపిన చొరవను సంఘాలు ధన్యవాదాలు తెలిపారు. కాకతీయ విశ్వవిద్యాలయం అభివృద్ధికి జిల్లాలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి సమిష్టిగా పని చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.