12-12-2025 08:19:29 PM
ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఇంటికి వేసిన తాళం పగులకొట్టి బంగారు ఆభరణాలు, కొంత నగదు ను దొంగలు ఎత్తుకెళ్లిన సంఘటన ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జిహెచ్ఎంసి ఘట్ కేసర్ సర్కిల్ అవుషాపూర్ కు చెందిన కేతవత్ శంకర్ ఈనెల 3వ తేదీన తన భార్య, చిన్న కుమార్తెతో కలిసి ఇంటికి తాళం వేసి, నాగర్ కర్నూల్ జిల్లా ఉరుకొండలోని బాల్యలోక్య తాండాలోని వారి పెద్ద కుమార్తె అయిన స్వర్ణలత ఇంటికి సర్పంచ్ ఎన్నికల ప్రచారం కొరకు వెళ్లారు. 12వ తేదీ శుక్రవారం ఉదయం 7:00 గంటలకు పక్కింటి వారు ఇంటి తాళం తెరిచి ఉందని దొంగతనం జరిగినట్లుగా అనుమానం వ్యక్తం చేయడంతో వెంటనే అందరూ అక్కడ నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి, ఇంటి తాళం పగిలిపోయి ఉంది.
లోపలికి వెళ్లి చూడగా, ఇంట్లోని వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండటం గమనించారు. వారు బెడ్ రూమ్ లో తనిఖీ చేసినప్పుడు, షెల్ఫ్ లో ఉంచిన పెట్టె నుండి, బంగారు నల్ల పూసల గొలుసు, బ్రాస్లెట్, ఒక బంగారు గొలుసు మొత్తం బరువు సుమారు 5 తులాలు కనిపించడం లేదు. బంగారు ఆభరణాలతో పాటు, కొన్ని కొత్త బట్టలు (ఇటీవల వారి బట్టల దుకాణం కోసం కొనుగోలు చేసినవి) కొంత నగదు కూడా పోయినవి. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.