12-12-2025 08:34:01 PM
బోథ్,(విజయక్రాంతి): రైతుల దగ్గర ఉన్న సోయా పంటను పూర్తి స్థాయిలో ప్రతి గింజ కొనుగోలు చేయాలని రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న కోరారు. శుక్రవారం బోథ్ మండల కేంద్రంలో రైతులతో కలిసి ర్యాలీగా వెళ్లి తహసిల్దార్ సుభాష్ చంద్ర కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా బొర్రన్న మాట్లాడుతూ... జిల్లా వ్యాప్తంగా 68వేల కు పైగా ఎకరాలలో సోయా పంటను పండిస్తే ఇప్పటి వరకు కేవలం 1058 మంది రైతుల దగ్గర 22,954 క్వింటల్లా పంటను మాత్రమే కొన్నారని, మిగతా పంటను ఎవరు కొంటారని ప్రశ్నించారు.
సోయా మద్దతు ధర రూ.5,328 ఉంటే ప్రైవేట్ వ్యాపారస్తులు క్వింటల్ కు రూ.4,100 మాత్రమే చెల్లిస్తూ రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. వెంటనే ప్రభుత్వాలు స్పందించి రైతుల దగ్గర ఉన్న పంటను అంతటిని కొనుగోలు చేయాలనీ డిమాండ్ చేశారు. అసలే అతివృష్టితో అంతంత మాత్రమే వచ్చిన పంట దిగుబడిని ఇప్పుడు పంట కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వెంటనే మార్క్ఫెడ్ అధికారులు పిఎసిఎస్ ద్వారా సోయా పంటను కొనుగోలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు ఉన్నారు.