ఖమ్మంలో వరద బీభత్సం
ఉగ్రరూపం దాల్చిన మున్నేరు వాగు
పరివాహ ప్రాంతాలన్నీ జలమయం
ఖమ్మం, సెప్టెంబర్ ౧(విజయక్రాంతి): రెండు రోజులుగా జోరున కుండపోతగా కురుస్తున్న వర్షాలకు ఖమ్మం నగరంతో సహా జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు, చెరువులు, కుంటలు పొంగిప్రవహిస్తుండటంతో వందలాది గ్రామాలు వరదముంపునకు గురయ్యాయి. సుమారు 100 మందికి పైగానే వివిధ చోట్ల వరదల్లో చిక్కుకుని, రక్షించే వారి కోసం ఆర్తనాదాలు చేశారు. ఖమ్మం నగరాన్ని మున్నేరు వరద చుట్టుముట్టడంతో చాలా కాలనీలు వరద దిగ్బంధం లో చిక్కుకున్నాయి.
రెండుమూడు అంతస్తులున్న చోట ఒక అంతస్తు మేర వరద నీరు చేరడంతో భవంతులు ఎక్కి సహాయం కోసం ఆర్తనాదాలు చేశారు. ప్రకాశం నగర్ బ్రిడ్జి పై నుంచి మున్నేరు ప్రవహించడంతో భయానక వాతావరణం ఏర్పడింది. ప్రధానంగా పై నుంచి వచ్చిన వరద వల్లనే ఖమ్మం వద్ద మున్నేరు 25 అడుగులకు మించి ప్రవహించింది. ధ్వంసలాపురం అగ్రహారం కాలనీలోకి కూడా వరద నీరు ప్రవేశించింది. కాల్వలు, నాలాలు, నగరంలోని లకారం , ధ్వంసలాపురం చెరువులకు చెందిన వందలాది ఎకరాల భూములు ఆక్రమణలకు గురైన నేపథ్యంలోనే నగరాన్ని వరదలు నిండా ముంచాయనే వాదన వినిపిస్తోంది. మధిర మున్సిపాలిటీ కాలనీలు నీట మునిగాయి.
ఎర్రుపాలెంలోని కట్టలేరు, మున్నేరు వరద, భారీ వర్షాలు వెరశి మధిర పట్టణాన్ని దిగ్బంధించాయి. బాధిత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముదిగొండ మండలం ఎడవల్లి లక్ష్మీపురం పాండ్రేగులపల్లి, కృష్ణాపురంలో వరదలో చిక్కుకున్న పలు కుటుంబాలను ఇళ్లను ఖాళీ చేయించి,సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఖమ్మం కరుణగిరి చర్చి ప్రాంతంలోని రాజీవ్ స్వగృహ ఎదురుగా స్కూలు దగ్గరలోని ఇంట్లో ఎనిమిది మంది చిక్కుకున్నారు. మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిస్ధితిని ఎప్పటికప్పుడు సమీక్షించి, అధికారులను అప్రమత్తం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో
భధ్రాద్రి కొత్తగూడెం(విజయక్రాంతి): వర్షాల కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అతలాకుతలమైంది. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్ని జలమయమై, ఇళ్లలోకి వరదనీరు చేరుకొని తీవ్ర నష్టం వాటిల్లింది. కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను అప్రమత్తం చేయడమే కాకుండా జోరువానలో పర్యటిస్తూ పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. బూర్గంపాడు మండలం కృష్ణసాగర్ పంచాయతీలోని ఊర్లదోసపాడు గ్రామంలో బావుల వద్ద కట్టేసి ఉంచిన 30 పశువులు పాలవాగు వరద తాకిడికి కొట్టుకుపోయి మృత్యువతా పడ్డాయి. బూర్గంపాడు మండల పరిదిలోని వేపలగడొో్డకొమ్మునగరిపేట మధ్య గల తూమువాగు కల్వర్టు కొట్టుకుపోయింది.
అదే మండలంలోని సీతారామ ప్రాజెక్టు కాలువ భారీ వర్షాలకు గండి పడింది. ఉల్వనూరులో సుమారు 50 ఇళ్లలోకి వరదనీరు చేరుకొంది. పాల్వంచ కేఎల్‌ఆర్ డిగ్రీ కాలేజీ భవనంలో కొనసాగుతున్న గిరిజన గురుకులం కళాశాలలోకి వరదనీరు చేరుకొంది. చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలో వరద నీరు కొత్తగూడెం ప్రధాన రోడ్డుపై చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. భద్రాచలం పట్టణంలోని పలు కాలనీల్లో వర్షం నీరు చేరుకొంది.
అశోక్‌నగర్‌కాలనీ, ఏఎంసీ కాలనీ, కొత్తకాలనీ, రాజ్‌పేట ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు రావడంతో జనం ఇబ్బందులు పడ్డారు. ములకలపల్లి మండలం కొత్తూరు గ్రామం సమీపంలోగల సీతారామ ప్రాజెక్టు కాలువకు ఏకదాటి వార్షాల కారణంగా గండి పడింది. వాగులు, వంకలు పొంగి ప్రవహించి జన జీవనం అతలాకుతలం కావడంతో కలెక్టర్ జితేష్ వి పాటిల్ జోరువానలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. సింగరేణి ప్రధాన ఆసుపత్రి ఆదివారం ఉదయం నుంచి అందకారంలో మగ్గుతోంది. ఐసీయూలో సెల్‌ఫోన్ లైట్‌ల ఆన్‌చేసి చికిత్స అందిస్తున్నారు.






