14-08-2025 10:24:46 PM
ప్రజల ఇబ్బందులు..
కోదాడ: భారీ వర్షాలకు మంగళ తండా గ్రామంలో వరద నీరు ఇండ్లలోకి, వీధుల్లోకి చేరడంతో గ్రామస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలోని ప్రధాన రహదారి వెంబడి ఉన్న ఎన్ఎస్పీ కాలువకు వరద నీరు పోటెత్తడంతో ఎన్ఎస్పీ కాల్వ పొంగి గ్రామంలోని ఇండ్లలోకి వీధుల గుండా నీరు ప్రవహించడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ఎస్పి కాలువ అధికారులు తూములను కాలువను మరమ్మలు చేయకపోవడంతో ఈ పరిస్థితి దాపురించిందని తెలుపుతున్నారు. తూముల వద్ద చెత్తాచెదారం చేరడంతో తూములగుండ నీరు ప్రవహించకుండా గ్రామంలోకి వెళుతుందని గ్రామస్తులు వాపోతున్నారు. ఇదిలా ఉంటే గ్రామంలో రోగాలు ప్రభలే ప్రమాదం ఉందని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.
గ్రామంలో సరియైన డ్రైనేజీలు లేకపోవడం వలన వరద నీరు రహదారుల గుండా ప్రవహించి ఇండ్లలోకి చేరుతుందని తెలుపుతున్నారు. ఎప్పుడు వర్షం వచ్చినా భయాందోళనకు గురికావలసిన పరిస్థితి నెలకొన్నదని, వర్షాలు వచ్చిన రోజు రాత్రిళ్ళు గ్రామస్తులు లేచి ఉండాల్సిన పరిస్థితి ఉందని ఇంట్లోకి నీరు రాకుండా కావలి ఉండాలని తెలుపుతున్నారు.అధికారులు ఇప్పటికైనా స్పందించి ఎన్ఎస్పి కాలువ డ్రైనేజీలను మరమ్మత్తులు చేసి వరద నీరు గ్రామం మీదకు రాకుండా చూడాలని కోరుతున్నారు.