14-08-2025 11:13:57 PM
కలెక్టర్ జితేష్ వి పాటిల్..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District)లో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు, అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్(District Collector Jitesh V Patil) సూచించారు. విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా నదులు, వాగులు, చెరువులు పొంగిపొర్లే అవకాశం ఉంది. రోడ్లపైకి నీరు చేరే పరిస్థితులు ఏర్పడవచ్చు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని, బయటకు రావాల్సి వస్తే అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సెల్ఫీలు తీసుకోవడానికి పొంగిపొర్లుతున్న వాగులు, చెరువులు, నదుల వద్దకు వెళ్లి ప్రమాదాలకు లోనుకావద్దని ఆయన హెచ్చరించారు.
విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రజలు తక్షణమే జిల్లా కలెక్టరేట్‌లో లేదా ఆర్డీవో కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్లకు, లేదా తమ మండల తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలకు కాల్ చేసి సమాచారం అందించి సహాయం పొందవచ్చని కలెక్టర్ తెలిపారు. జిల్లా అధికారులు, డివిజన్ స్థాయి అధికారులు, అన్ని మండల అధికారులు అప్రమత్తంగా ఉండి, వర్షాల కారణంగా ఏర్పడే పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఏర్పడిన సందర్భంలో సంబంధిత రెవెన్యూ, పోలీసు, రోడ్లు, మున్సిపల్, పంచాయతీ శాఖలతో సమన్వయం చేసుకుని తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ప్రమాదాలను నివారించడానికి అధికారులు చేపట్టే చర్యలకు ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ వి పాటిల్ విజ్ఞప్తి చేశారు.