14-08-2025 10:54:02 PM
సోషియాలజీ, సోషల్ వర్క్ విభాగ అధిపతి ప్రొఫెసర్ యం.స్వర్ణలత..
హన్మకొండ (విజయక్రాంతి): పరిశోధక విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలని సోషియాలజీ అండ్ సోషల్ వర్క్ విభాగ అధిపతి ప్రొఫెసర్ యం.స్వర్ణలత అన్నారు. కాకతీయ యూనివర్సిటీ(Kakatiya University)లోని సోషయాలజీ అండ్ సోషల్ వర్క్ విభాగంలో జరిగిన సోషల్ మెథడాలజీ ప్రత్యేక తరగతుల ముగింపు కార్యక్రమం సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సమాజంలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని రూపు మాపడం కోసం, తగిన పరిష్కారం దిశగా ఆలోచించడం కోసం పరిశోధనలు చేయాలని అన్నారు.
పరిశోధనలో నాణ్యతను పాటించాలని, ఫీల్డ్ కి వెళ్లి పరిశీలిస్తే అనేక సమస్యలను గుర్తించవచ్చని, ప్రజల్లోకి వెళ్లాలని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసి వాటికి పరిష్కారం చేయడం కోసం మార్గాలను వెతకాలని అన్నారు. ప్రజలతో మమేకమై విద్యార్థి నిరంతర అధ్యయనం కలిగిన వాడై ఉండాలని పరిశోధన విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సోషియాలజీ అండ్ సోషల్ వర్క్ విభాగ బిఓ ఎస్ ప్రొఫెసర్ కుంట ఐలయ్య, అధ్యాపకులు డా.సుభాసు, డా.వాసు, సాహితి, ప్రసన్న, జాస్మిన్, రజిత, పరిశోధక విద్యార్థులు దొగ్గెల తిరుపతి, రాజారాం, కె తిరుపతి, రాజు, శ్రీదేవి, స్రవంతి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.