అభిమానులకు.. నాకు దూరం రెండు గుండెలే!
పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న తాజాచిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమా ఉగాది కానుగా మార్చి 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. ఈ వేడుకలో చిత్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “నాకు సినిమాలు చేయొచ్చు అనే భరోసా ఇచ్చిందీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.
ఈ సినిమా ‘గబ్బర్ సింగ్’ అంత విజయం సాధిస్తుందను కుంటున్నా. ఈ సినిమాను మన జీవితంలోనుంచి తీసేయలేం. అందరికీ ఉన్న గొప్ప వినోదం సినిమా. అందరు హీరోలు బాగుండాలి, అన్ని సినిమాలు ఆడాలి. అభిమానులు లేకపోతే పవన్ కళ్యాణ్ లేడు. అభిమానులకు, నాకు రెండు గుండెలు దూరం అంతే. నాది మిమ్మల్ని ప్రేమించే గోత్రం, సేవ చేసే నక్షత్రం” అన్నారు. హరీశ్ శంకర్ మాట్లాడుతూ.. “మొదట కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ‘ఖుషి’కి కొనసాగింపు లాంటి కథ అనుకున్నాం. కాలేజ్ సమయంలో ఇగోతో విడిపోయిన ఇద్దరు స్టూడెంట్స్..
అదే ఇగోతో కాలేజ్‌లో లెక్చరర్స్‌గా జాయిన్ అయితే ఎలా ఉంటుందనే ఆలోచనతో కథ అనుకున్నాం. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల కథ మార్చాం. ఈ ప్రయాణంలో మా నిర్మాతలు నన్ను భుజాల మీద మోశారు. గుండెల్లో పెట్టుకున్నారు. ఏ దర్శకుడికైనా డ్రీమ్ ప్రొడ్యూసర్స్ వీళ్లు. మార్చి 19న థియేటర్లలో కలుద్దాం.. ఉస్తాద్ ఉగాది జరుపుకుందాం” అన్నారు. కథానాయిక శ్రీలీల మాట్లాడుతూ.. “హరీశ్ శంకర్ నిజాయితీగా పనిచేస్తారు. అందుకే అంత ముక్కుసూటిగా ఉంటారు. ఒక యజ్ఞంలా ఈ సినిమా పూర్తి చేశారు. పవన్‌కళ్యాణ్.. పవర్ స్టార్, పీపుల్ స్టార్.
ఆయన గురించి మాట్లాడే అంత పెద్దదాన్ని కాదు నేను. ఈ ఉగాదిని ఉస్తాద్ ఉగాది చేస్తారని కోరుకుంటున్నా” అన్నారు. ‘పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప స్టార్‌తో తెరను పంచుకో వడం గౌరవంగా భావిస్తున్నాన’ని కథానాయిక రాశి ఖన్నా చెప్పారు. నిర్మాత నవీన్ మాట్లాడుతూ.. “మేము ఎన్ని పెద్ద సినిమాలు చేసినా.. సినీ పరిశ్రమకు వచ్చిన తొలినాళ్ల నుంచి మాకు పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలనేది మా కల.
మా కోరిక ఈ మార్చి 19న నెరవేరుతుంది” అని తెలిపారు. నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. “ఉస్తాద్ భగత్ సింగ్’.. ఈ మధ్య కాలంలో నేను చూసిన సూపర్ డూపర్ కమర్షియల్ ఫిల్మ్. ప్రారంభం నుంచి చివరి దాకా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది” అని చెప్పారు. పలువురు సినీ ప్రముఖులు, చిత్రంబృందం ఈ వేడుకలో పాల్గొన్నారు.




