calender_icon.png 10 October, 2025 | 3:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముహూర్తం కోసం..!

10-10-2025 01:28:06 AM

మందకొడిగా మద్యం షాపుల దరఖాస్తులు

మహబూబాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి) : మద్యం షాపుల లైసెన్సు పొందేందుకు దరఖాస్తు చేసుకునే గడువు మరో ఎనిమిది రోజులే ఉండగా, ఇప్పటివరకు మహబూబాబాద్ జిల్లాలో దరఖాస్తుల కార్యక్రమం మందకొడిగా  సాగుతోంది. జిల్లావ్యాప్తంగా 61 మద్యం షాపులను 2025 డిసెంబర్ 1 నుండి 30 నవంబర్ 2027 వరకు నిర్వహించుకోవడానికి లైసెన్సుల జారీ కోసం దరఖాస్తులను ఎక్సైజ్ శాఖ స్వీకరిస్తుంది.

దరఖాస్తుల గడువు ముగియడానికి మరో ఎనిమిది రోజులే ఉండగా, ఇప్పటివరకు కేవలం 11 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. జిల్లావ్యాప్తంగా 61 మద్యం షాపులకు దరఖాస్తుల స్వీకరణ కోసం ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో వివిధ కేటగిరీలకు కొన్ని షాపులను కేటాయించగా మరికొన్ని జనరల్ కేటగిరీకి కేటాయించారు.

గత టర్మ్ మాదిరిగా దరఖాస్తు ఫీజు 2 లక్షలు కాకుండా ఈసారి అదనంగా ఒక లక్ష పెంచి మూడు లక్షల రూపాయలు తిరిగి చెల్లించని విధంగా దరఖాస్తు రుసుము నిర్ణయించారు. దరఖాస్తు రుసుము పెంచడం, స్థానిక ఎన్నికల నేపథ్యం కూడా దరఖాస్తులు చేయడానికి కాస్త ఆటంకంగా మారిందని భావిస్తున్నారు. దీనికి తోడు దరఖాస్తులు చేసుకున్న వారి పేర్లను లక్కీ డ్రా తీయడంతో కొందరు తమ పేర్లపై ‘బలం’ ఎంతుందో తెలుసుకునేందుకు జాతకాలు చూయించుకొని, ఆమేరకు ‘బలం’ బాగున్న రోజే దరఖాస్తు చేసుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

ప్రాదేశిక ఎన్నికలు వాయిదా పడడంతో ఇక మద్యం షాపుల లైసెన్సుల కోసం దరఖాస్తులు చేసుకునేందుకు ఆసక్తి చూపే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. దీనికి తోడు శనివారం నుండి మంచి ముహూర్తం ఉండడంతో ఆరోజు ఎక్కువగా దరఖాస్తులు సమర్పించే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. లైసెన్స్ ఫీజు అధికంగా ఉండడంతో చాలామంది ‘కూటమి’గా ఏర్పడి దరఖాస్తులు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మద్యం షాపుల లైసెన్సుల దరఖాస్తుల స్వీకరణ కోసం ఎక్సైజ్ శాఖ విస్తృతంగా ప్రచా రం నిర్వహిస్తోంది.

దరఖాస్తులు చేసుకునే వారికి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఎక్సైజ్ శాఖ అధికా రులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలోని ఈ మద్యం షాపు కైనా దరఖాస్తు చేసుకునే విధంగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తుదారులకు తగిన సమాచారం అందుబాటులో ఉంచినట్లు మహ బూబాబాద్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జీ.చిరంజీవి తెలిపారు.