25-10-2025 11:50:10 AM
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ, మాజీ మంత్రి హరీశ్ రావు(Former Minister Harish Rao) చేసిన కృషి ఎట్టకేలకు ఫలించింది. ఉపాధి నిమిత్తం జోర్డాన్ వెళ్లి వివిధ కారణాలతో అక్కడే చిక్కుకున్న 12 మంది వలస కార్మికులు ఎట్టకేలకు సొంతూళ్లకు చేరుకున్నారు. తెల్లవారు జామున హైదరాబాద్ చేరుకున్న వలస కార్మికులు మాజీ మంత్రి హరీశ్ రావుని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియచేసారు. జోర్డాన్ లో అనేక ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొన్న తమను ఆదుకొని, స్వదేశానికి తిరిగి వచ్చేలా చేసారని బీఆర్ఎస్ పార్టీకి, హరీశ్ రావుకి ధన్యవాదాలు తెలిపారు. తాము తిరిగి తెలంగాణకు వచ్చేందుకు సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరినప్పటికీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసారు.
కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్లినప్పటికీ ఎవరూ స్పందించలేదని ఆరోపించారు. తమను తిరిగి స్వస్థలాలకు తీసుకువచ్చిన బీఆర్ఎస్ పార్టీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని ఆనందం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా హరీశ్ రావు వారి కుటుంబ పరిస్థితులు, జోర్డాన్ లో వారు ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి అడిగి తెలుసుకున్నారు. కడుపు నిండా తిండి కూడా లేకుండా అనేక ఇబ్బందులు ఎదుర్కున్నామని జోర్డాన్ లో అనుభవించిన బాధలు చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని ఈ సందర్భంగా హరీశ్ రావు వారికి భరోసా ఇచ్చారు. తెలంగాణలో ఉండి ఉపాధి, ఉద్యోగ మార్గాలు ఆలోచించాలని సూచించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల్లో జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాల్లోని తమ తమ సొంతూళ్లకు వలస కార్మికులు పయనమయ్యారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు గారు మాట్లాడుతూ... కేసీఆర్ ఆదేశాలతో జోర్డాన్ లో చిక్కుకున్న 12 మందిని స్వదేశానికి తిరిగి తీసుకువచ్చేందుకు కృషి చేసామని పేర్కొన్నారు. బతుకు తెరువు కోసం, అప్పులు తీర్చడం కోసం జోర్డాన్, ఇజ్రాయిల్, గల్ఫ్ వంటి దేశాలకు వెళ్లి ఏజెంట్ల చేతుల్లో చిక్కుకొని ఎంతో మంది బతుకులు ఆగం అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 12 మంది వలస కార్మికుల సమస్య తెలియగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లామని, స్పందించి వారికి సాయం అందించాలని కోరామని తెలిపారు. మరోవైపు జోర్డాన్ లోని ఇండియన్ ఎంబసీ ఆఫీస్ కు వెళ్లి కార్మికులు అనేక సార్లు మొరపెట్టుకున్నామని, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసారు. అయినా స్పందన లేదని మండిపడ్డారు. అందుకే జోర్డాన్ లో చిక్కుకున్న12 మంది కోసం పెనాల్టీ కట్టి తిరిగి స్వదేశానికి తీసుకురావడం జరిగిందని వివరించారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంతో మంది ఉపాధి నిమిత్తం వివిధ దేశాల్లో అనేక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతూన్నారు. మన పిల్లల్ని మనం కాపాడుకోవడం ప్రభుత్వాల బాధ్యతని హరీశ్ రావు వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దునిద్ర పోతే బీఆర్ఎస్ పార్టీ 12 మందినీ కాపాడి స్వదేశానికి తీసుకురావడం జరిగిందన్నారు.
ఇవాళ రేవంత్ రెడ్డి గల్ఫ్ సంక్షేమ బోర్డు పెడ్తా అని వాళ్లకోసం ప్రత్యక పాలసీ తెస్తామని, నిధులు పెడతామన్నారు. రెండు సంవత్సరాలు అయినా రేవంత్ రెడ్డి నుంచి స్పందన లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఏ ఒక్కటి కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. మన రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారని, అందులో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్.. విదేశాల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి తెలంగాణ వాసులను తీసుకురావడానికి ప్రత్యేకమైన ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలని హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. ప్రజలు మనకి అధికారం ఇచ్చింది ఆపదలో ఉన్న ప్రజలని ఆదుకోవడానికి, కష్టాల్లో ఉన్న వారిని కాపాడుకోవడానికేనని సూచించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, గెలిచినా తరవాత అమలు చేయడం, ఇచ్చిన ప్రతి మాటను నిలపెట్టుకోవడం మీ భాద్యతని గుర్తుచేశారు. కానీ మీరు మరిచిపోతే ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ వీళ్లందరిని స్వదేశానికి తిరిగి తీసుకువచ్చింది. వలస కార్మికులకు భాసటగా నిలిచిందని హరీశ్ రావు స్పష్టం చేశారు.