11-01-2026 01:10:50 AM
స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో రూ.2.58 కోట్ల టోకరా
500 శాతం లాభాలంటూ ఆశ
నకిలీ సెబీ సర్టిఫికెట్లతో మోసం
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 10(విజయక్రాంతి): సామాన్యులే కాదు.. అత్యున్న త పదవుల్లో పనిచేసిన అధికారుల కుటుంబాలు కూడా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కు తున్నాయి. తాజాగా కేంద్ర దర్యాప్తు సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఓ మాజీ ఐపీఎస్ అధికారి భార్యను టార్గెట్ చేసిన కేటు గాళ్లు.. ఆమె నుంచి ఏకంగా రూ. 2.58 కోట్లు కాజేశారు. స్టాక్ మార్కెట్ ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో మాయమాటలు చెప్పి నిండా ముంచారు.
స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయంటూ, ట్రేడింగ్ చిట్కాలు చెపుతామం టూ సైబర్ నేరగాళ్లు తొలుత బాధితురాలికి వాట్సాప్ సందేశం పంపించారు. దీనిపై ఆమెకు పెద్దగా అవగాహన లేకపోవడంతో, అదే గ్రూపులో తన భర్త మాజీ ఐపీఎస్ నం బర్‌ను కూడా యాడ్ చేయించారు. తమది సెబీ సర్టిఫైడ్ సంస్థ అని, తమ వెబ్ సైట్ ద్వారా పెట్టుబడి పెడితే 500 శాతం లాభాలు వస్తాయని నమ్మబలికారు.
బాధితులు నమ్మేలా వాట్సాప్‌లో నకిలీ సెబీ సర్టిఫికెట్లను పంపించారు. సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మిన సదరు మహిళ డిసెంబర్ 24 నుంచి ఈ నెల 5వ తేదీ వరకు కేవలం 13 రోజుల్లో విడతల వారీగా భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టారు. మొత్తం 19 లావాదేవీల ద్వారా రూ.2.58 కోట్లను నేరగాళ్ల ఖాతాలకు మళ్లించారు. కొంతకాలం తర్వాత బాధితురాలు పెట్టుబడి పెట్టడం ఆపివేశారు.
దీంతో అసలు రంగు బయటపెట్టిన కేటుగాళ్లు.. వెంటనే మరిన్ని డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని, లేదంటే ఇప్పటివరకు పెట్టిన డబ్బంతా పోతుందని, ఖాతా ఫ్రీజ్ అవుతుందని బెదిరించడం మొదలుపెట్టారు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు.