11-01-2026 01:26:58 AM
మారుతున్న కాలానికనుగుణంగా మేడారం జాతర నిర్వహణలో ఆధునికతను జోడిస్తున్నారు. గతంలో భక్తులు వడిబియ్యం పోయడానికి సంచులతో కూడిన హుండీలను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తుండగా, కానుకల రూపంలో నగదు, వెండి బంగారు వస్తువులను సమర్పించడానికి ఇనుప హుండీలను ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ క్రమంలో కొన్నిసార్లు జాతర సమయంలో వర్షం కురవగా, హుండీల్లోకి వర్షం నీరు చేరి నోట్లు పాడయ్యాయి. ఈ నేపథ్యంలో ఈసారి మేడారం జాతర గద్దెల ప్రాంగణంలో కెనరా బ్యాంకు ఆధ్వర్యంలో ఈ - కానుక హుండీలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
భక్తులు వనదేవతలకు మొక్కుల రూపంలో నగదు చెల్లించడానికి ఈ - కానుక హుండీలు అనుకూలంగా ఉండేలా ఏర్పాటు చేశారు. భక్తులు ఫోన్ పే, గూగుల్ పే, ఇతర పేమెంట్ యాప్ ల ద్వారా గద్దెల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఈ - కానుక హుండీ పై ఉన్న స్కానర్ ద్వారా పేమెంట్ చేసే విధంగా ఏర్పాటు చేశారు. దీనికి కారణంగా భక్తులు చెల్లించే మొక్కులు బ్యాంకు ఖాతాలో నేరుగా జమ కానున్నాయి. స్కానర్ లను దుర్వినియోగం కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, తరచుగా స్కానర్ లను తనిఖీ చేయడం జరుగుతుందని బ్యాంక్ అధికారులు వెల్లడించారు.