11-01-2026 05:52:58 PM
న్యూఢిల్లీ: రాజ్‌కోట్‌లోని మార్వాడి విశ్వవిద్యాలయంలో వైబ్రంట్ గుజరాత్ సౌరాష్ట్ర ప్రాంతీయ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. ఈ సదస్సు 21వ శతాబ్దంలో ఆధునిక భారతదేశం ప్రయాణమని, ఇది ఒక కలతో ప్రారంభమై అచంచలమైన నమ్మకాన్ని చేరుకుందని ప్రధాని పేర్కొన్నారు. వైబ్రంట్ గుజరాత్ ప్రాంతీయ సమావేశం 2026 జనవరి 11, 12వ తేదీలో జరుగననుంది.
గుజరాత్‌లో పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త ఊపు ఇవ్వడం ఈ శిఖరాగ్ర సమావేశం ఉద్దేశ్యమని, జపాన్, దక్షిణ కొరియా, రువాండా, ఉక్రెయిన్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. విజయవంతమైన వైబ్రంట్ గుజరాత్ మోడల్ వ్యాప్తి, ప్రభావాన్ని మరింత పెంపొందించడానికి, రాష్ట్రవ్యాప్తంగా నాలుగు వైబ్రంట్ గుజరాత్ ప్రాంతీయ సమావేశాలు నిర్వహించబడుతున్నాయి. ఉత్తర గుజరాత్ ప్రాంతానికి సంబంధించిన మొదటి ప్రాంతీయ సమావేశం అక్టోబర్ 9-10, 2025 తేదీలలో మెహ్సానాలో జరిగింది.
ప్రస్తుతం, ఈ సమ్మిట్ కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల కోసం నిర్వహించబడుతోంది. దీని తరువాత, దక్షిణ గుజరాత్ (ఏప్రిల్ 9-10, 2026), మధ్య గుజరాత్ (జూన్ 10-11, 2026) ప్రాంతాలకు ప్రాంతీయ సమావేశాలు వరుసగా సూరత్, వడోదరలో జరుగుతాయి. రాజ్‌కోట్ సమ్మిట్‌కు 22 దేశాల నుండి సుమారు 350 మంది విదేశీ ప్రతినిధులు, గుజరాత్‌తో సహా దేశవ్యాప్తంగా 5,000 మందికి పైగా వ్యాపారవేత్తలు హాజరవుతారని భావిస్తున్నారు. ఈ సమ్మిట్‌లో 1,500కి పైగా అవగాహన ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది.