11-01-2026 04:46:35 PM
హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన అనుచరులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పార్టీ సీనియర్ నేత కార్తీక్ ఇంద్ర రెడ్డి పట్లోల్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి నిజాయితీ కలిగిన మోసగాడని, తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి వెనుకటి రోజులు తెస్తానని పేర్కొన్నారు. మోసం చేసేవారికే ప్రజలు అధికారం కట్టబెడతారని ముందే చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సరిగ్గా తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు.
రేవంత్ రెడ్డి ఆనాడు రెట్టింపు పెన్షన్లు, రైతుబంధు, దళిత బంధు, రెండు లక్షల ఉద్యోగాలు, పీఆర్‌సీ (PRC) ఇలా అనేక కార్యక్రమాలను ప్రకటించి ఒక్కదాన్నీ అమలు చేయకుండా విజయవంతంగా తెలంగాణ ప్రజలను 24 నెలలుగా మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తాజాగా నిరుద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారని, వారు చేస్తున్న ఆందోళనను గౌరవించి వారిని పిలుచుకొని ఉద్యోగాలు ఇస్తామని భరోసా ఇవ్వాలని కేటీఆర్ అన్నారు.
నిరుద్యోగులకు, విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెంటనే ఇవ్వాలని, తూతూ మంత్రంగా కేవలం మీడియా హెడ్‌లైన్ల కోసం ఇచ్చిన జాబ్ క్యాలెండర్‌పై దృష్టి సారించి దాన్ని అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. వరుసగా దిల్‌సుఖ్‌నగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌తో పాటు అనేక చోట్ల విద్యార్థులు, నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనలను పట్టించుకోవాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని కోరారు.
ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో బట్టల షాపు ప్రారంభోత్సవానికి వెళ్లిన రేవంత్ రెడ్డి పక్కనే గతంలో రాహుల్ గాంధీ నిరుద్యోగులతో సమావేశమైన గాంధీనగర్‌కు పోలేకపోయారని కేటీఆర్ అన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి అవి మావయ్య అని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని… కానీ ఆ అబద్ధాలు ఎక్కువ రోజులు నడవవని కేటీఆర్ అన్నారు.