మాజీ ఎమ్మెల్యే గొర్రె సిద్ధయ్య కన్నుమూత
చేర్యాల రాజకీయాల్లో చెరగని ముద్ర
చేర్యాల, ఆగస్టు 9: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, చేర్యాల మాజీ ఎమ్మెల్యే గొర్రె సిద్ధయ్య (95) అనారోగ్యంతో హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆదివారం తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మృతితో కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు, చేర్యాల ప్రాంత ప్రజల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
సిద్ధయ్య ఉమ్మడి వరంగల్ జిల్లా (ప్రస్తుతం జనగామ జిల్లా) సిద్దిపేట జిల్లాల పరిధిలోని మద్దూరు మండలం బైరాన్‌పల్లి గ్రామం. ఆయన భార్య శాంతమ్మ మూడేళ్ల క్రితం మృతి చెందారు. వీరికి ఒకే సంతానం గొర్రె భాస్కర్ హైదరాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా సేవలందిస్తున్నారు. ఈ కుటుంబం హైదరా బాద్‌లో స్థిరపడింది. ఎమర్జెన్సీ అనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1978లో జరిగిన శాసనసభ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
అప్పట్లో ఉమ్మడి వరంగల్/మెదక్ సరిహద్దు ప్రాంతం రాజకీయంగా కీలకమైన చేర్యాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గొర్రె సిద్ధయ్య బరిలో దిగారు. ఈ ఎన్నికల్లో సిద్ధయ్యకు 18,547 ఓట్లు రాగా, సమీప స్వతంత్ర అభ్యర్థి నిమ్మ రాజిరెడ్డికి 11,491 ఓట్లు లభించాయి. ప్రత్యర్థిపై 7,056 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించి ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు.
రాజకీయ సమీకరణాలు మారుతున్న తరుణంలో సినీ నటుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రభజన ంలో 1983 జరిగిన శాసనసభ ఎన్నికలలోనూ ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. నిమ్మ రాజిరెడ్డి చేతిలో 20,155 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత కూడా పార్టీ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం ఎంతగానో శ్రమించారు. నాడు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో మారుమూల ప్రాంతమైన చేర్యాలలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయించారు.
గ్రామీణ ప్రాం తాలకు తాగు, సాగునీటి సౌకర్యాలు, రహదారు ల నిర్మాణం, విద్యుద్దీకరణ వంటి అభివృద్ధి పనులకు ఆయన పెద్దపీట వేశారు. అధికారం లో ఉన్నా, లేకపోయినా నిత్యం ప్రజలతో మ మేకమై ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికై నిరంతరం పరితపించారు. తన సుదీర్ఘ రాజ కీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చవి చూసినప్పటికీ, విలువలను, సిద్ధాంతాలను ఎప్పుడూ వీడలేదు. ఆయనొక నిజాయితీ గల సీనియర్ నేతగా ప్రత్యేక గుర్తింపు పొందారు. 1961లో చేర్యాల నియోజకవర్గం ఏర్పడి, కాలక్రమేణా 2008 పునర్విభజనలో భాగంగా రద్దయిన చేర్యాల అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో గొర్రె సిద్ధయ్య పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.






