23-09-2025 05:11:39 PM
హైదరాబాద్: మాజీ ఎంపీ వినోద్ కుమార్(Former MP Vinod Kumar) మంగళవారం తెలంగాణ భవన్ లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి ఉత్తమ్(Minister Uttam Kumar Reddy) సమ్మక్క సారక్క బ్యారేజ్ కు అనుమతులు సాధించినట్టు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ఛత్తీస్‌ఘడ్ తో యాభై ఎకరాల ముంపునకు సంబంధించి అంగీకారం కుదిరితే ఏవో గొప్పలు సాధించినట్టు ప్రచారం చేసుకుంటున్నారని.. 2001లో కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి భయపడి అప్పట్లో చంద్రబాబు దేవాదుల ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేశారని అన్నారు. రూ. 811 కోట్ల రూపాయల వ్యయంతో అప్పట్లో దేవాదులకు జీవో ఇచ్చారు.. కానీ 2009 వరకు కూడా ప్రాజెక్టు పూర్తి కాలేదన్నారు. రూ.15 వేల కోట్ల నుంచి 20 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఆ ప్రాజెక్టు నుంచి సరిగా నీళ్లు తొడలేకపోయారని తెలిపారు. ఫుట్ వాల్ కూడా సరిగా పెట్టకుండా దేవాదుల డిజైన్ చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించకుండా కేసీఆర్ దేవాదుల ప్రాజెక్టును సరిదిద్దారని పేర్కొన్నారు.
దేవాదులను పటిష్టం చేసేందుకు ఏడు టీఎంసీల సామర్థ్యంతో సమ్మక్క సారక్క బ్యారేజ్ ను కేసీఆర్ నిర్మించారని గుర్తుచేశారు. సమ్మక్క బ్యారేజ్‌కు ఛత్తీస్‌ఘడ్ అభ్యంతరాలతో సీడబ్ల్యూసీ అనుమతులు ఇవ్వలేదని, 2023 ఎన్నికల సందర్భంగా ఛత్తీస్‌ఘడ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది.. ఇక్కడి కాంగ్రెస్ నాయకులు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కేసీఆర్ కు అనుమతులు దక్కకుండా చేశారన్నారు. అప్పుడు ఛత్తీస్‌ఘడ్ సంతకం చేసిన ఒప్పంద పత్రాన్ని ఉత్తమ్ తీసుకొచ్చి గొప్పగా చెప్పుకుంటున్నారని, దేవాదుల నుంచి నీళ్లు తెచ్చి నిల్వ చేసుకునేందుకు పది రిజర్వాయర్లు నిర్మించిన ఘనత కేసీఆర్‌దేనని తెలిపారు. పెండింగ్ రిజర్వాయర్లను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయాలని, 50 ఎకరాలపై ఒప్పందం చేసుకుంటేనే కాంగ్రెస్ ఇంత ప్రచారం చేసుకుంటే ఎన్నో ప్రాజెక్టులు ఎంతో కష్టపడి సాధించిన కేసీఆర్ ఎంత ప్రచారం చేసుకోవాలని పేర్కొన్నారు.