ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసిన మాజీ జడ్పీటీసీ తిర్మల్ గౌడ్
దోమకొండ, ఆగస్టు 23 (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశ వేడుకలు దోమకొండలో ఆదివారం జరిగాయి. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ సభ్యుడు తీగల తిర్మల్ గౌడ్ గృహప్రవేశం చేసిన లబ్ధిదారులకు నూతన వస్త్రాలను అందజేసి అభినందించారు.
దోమకొండకు చెందిన రావులపల్లి పూజితరంజిత్ గౌడ్, కామిండ్ల లక్ష్మిఅంజయ్య, అయ్యవారి ఉమారాణిస్వామి, నిమ్మ సరితబాలరాజ్లు ఇందిరమ్మ ఇళ్లలో గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు కృషి చేస్తోందన్నారు.
దోమకొండ మండలంలో 461 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. రెండో దశలో గుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వగా, మండలంలో కొత్తగా 17 ఇళ్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు.ఆర్థిక ఇబ్బందులతో వివిధ దశల్లో అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాలకు కూడా ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా మంజూరు అందించనున్నట్లు తెలిపారు. బేస్మెంట్, పిల్లర్లు, గోడలు నిర్మించుకుని ఆగిపోయిన ఇళ్లతో పాటు ఇళ్లు కూలిపోయిన కుటుంబాలకు కూడా ఇళ్ల మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇన్చార్జి మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సహకారంతో మండలానికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరులు రావడం సంతోషకరమన్నారు. లబ్ధిదారుల తరఫున వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆశబోయిన శ్రీనివాస్, మండల మాజీ అధ్యక్షుడు అనంతరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ గోపాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు సీతారాం మధు, తాటిపల్లి శ్రీకాంత్, అబ్రబోయిన స్వామి, నర్సింలు, షమ్మీ, కొండ ఆంజనేయులు, రాజేందర్, ఖలీం, బట్టు రాములు, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.






