05-11-2025 07:36:59 PM
హైదరాబాద్: వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం పర్యటించారు. ఆయన పరిగి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని రూ.వెయ్యి కోట్లతో విద్యుత్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. “కాంగ్రెస్ అంటేనే కరెంటు.. కరెంటు అంటేనే కాంగ్రెస్” అని, రాష్ట్రంలో 53 లక్షల కుటుంబాలకు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని గుర్తు చేశారు. అందుకు గాను ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం రూ.2,830 కోట్లు విద్యుత్ శాఖకు చెల్లిస్తోందని పేర్కొన్నారు.
వికారాబాద్ జిల్లాలో 1.43 లక్షల నిరుపేద కుటుంబాలకు ఉచిత విద్యుత్, పరిగిలో 44,500 కుటుంబాలకు లబ్ధి. పేద ప్రజల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం రూ1.6 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు, ప్రతి ఇంటికి రూ.5 లక్షల మంజూరు చేశామని, 93 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం, ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వైద్యం, 60 వేల ఉద్యోగాలు, 100 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, ఒక్కొక్కటి రూ.200 కోట్లతో నిర్మాణం, మన్నెగూడ–బీజాపూర్ రహదారి పనులు వేగంగా కొనసాగుతున్నాయని గుర్తుచేశారు. అలాగే పరిగిలో 9-33/11 కేవీ సబ్ స్టేషన్లు, 220 కేవీ & 400 కేవీ సబ్ స్టేషన్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. తెలంగాణ రైజింగ్ ను ఏ ప్రతిపక్షం అపలేదని భట్టి హర్షం వ్యక్తం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని ఉపముఖ్యమంత్రి మండిపడ్డారు.