calender_icon.png 24 November, 2025 | 7:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలకు ఉచిత వైద్యం అందించడమే లక్ష్యం

24-11-2025 06:48:33 PM

ప్రభుత్వ హాస్పిటల్ కి వచ్చేది మధ్య పేద తరగతి వాళ్లే.

హుజురాబాద్, జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి విలువైన వైద్య పరికరాలు అందజేత..

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్..

హుజురాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రులుకు వచ్చే పేద రోగులను టెస్టుల పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులకు పంపొద్దని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రభుత్వాసుపత్రి వైద్యులకు సూచించారు. హుజురాబాద్, జమ్మికుంట ప్రభుత్వాసుపత్రికి రూ.2.5కోట్ల సీఎస్ఆర్ నిధులతో అందించిన వైద్య పరికరాలను సోమవారం ఆయన, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి ప్రారంభించారు. ఈసీజీ మిషన్, అల్ట్రాసౌండ్ మిషన్, మల్టిపురా మానిటర్, ఆటోక్లేవ్(లార్జ్), డయా థెర్మా మిషన్, అనెస్థిషియా వర్క్ స్టేషన్, ఈఎన్టీ హెడ్ లైట్, ఫెటల్ మానిటర్ సహా మొత్తం 15 వైద్య పరికరాలను అందించారు. అలాగే, గతంలో ఏర్పాటు చేసిన బోర్ మోటర్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ పేదవానికి ఉచితంగా వైద్యం అందేలా చూడాలని వైద్యులను కోరారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే మధ్యతరగతి, పేదలకు రూపాయి ఖర్చు లేకుండా పూర్తి చికిత్స చేసి పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు.

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు టెన్త్ క్లాస్ చదివే దాదాపు 20 వేల మంది విద్యార్థులకు ఉచితంగా బ్రాండెడ్ సైకిళ్లను అందించిన సంగతి గుర్తు చేశారు. త్వరలోనే 9వ తరగతి విద్యార్థులకు సైతం సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నానన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ఆరంభంలోనే ప్రభుత్వ స్కూళ్లలో 1 నుండి 6వ తరగతి చదువుకునే విద్యార్థులందరికీ స్కూల్ బ్యాగ్, నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, జామెట్రీ బాక్స్, వాటర్ బాటిల్ తో కూడిన కిట్స్ ను మోదీ గిఫ్ట్ పేరుతో అందించేందుకు ప్రణాళిక రూపొందించామని తెలిపారు. 

చెక్ డ్యామ్లపై విమర్శలు

చెక్ డ్యాం కూలిపోవడం పై స్పందిస్తూ..అవి ప్రజల కోసం కాదని కమీషన్ల కోసం కట్టిన నిర్మాణాలుగా అభివర్ణించారు. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఆపకుండా కమీషన్లు ఇస్తున్నాయని నాసిరకం పనులు జరుగుతున్నాయని ఆరోపించారు. చెక్ డ్యాం కూలిపోవడం పై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విచారణ జరిపి, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, కాంట్రాక్టర్ల ఆస్తులను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమాలలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట రమణ, డీసీహెచ్ ఎస్ డాక్టర్ కృష్ణ ప్రసాద్, హుజురాబాద్ ఆర్డీవో రమేష్ బాబు, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నారాయణ రెడ్డి, ఆర్ఎంవో డాక్టర్ ప్రసాద్, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ చందు, హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, హుజురాబాద్ టౌన్ సీఐ కరుణాకర్, వైద్య సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.